తెలంగాణ ‘నాగాస్త్రం’

వెయ్యేళ్లు గడిస్తేనేం..
ఓ అరుదైన వేగుచుక్క వెలుగులోకొచ్చింది
ఆరవెల్లి అరుణ తార
తెలంగాణ తొలివీరనారి
నాగమ్మ రణభేరికి
పల్నాడు దద్దరిల్లింది
చరిత్ర ద్రోహుల చీకటి పుటల్ని చీల్చుకుని
ఉదయిస్తోంది నవ్య నాగాస్త్రం
తెలంగాణ నాగమణి తెగించి పోరే వీరనారి
ధీరత్వానికి ఎదిరించి పోరాడలేని పిరికి పందలు
పందులవలే అపనిందలేసి అవమానించితిరి కదా!
‘నాయుడు చేసిన నయవంచనకు
గుంజికొట్టి చండాడిన చండీరాణి
అయినవారంత దూరమై అంధకారం ఆవరించినా
రాజధర్మం విస్మరించక న్యాయదేవతై నిల్చింది నాగమ్మ..
తెలంగాణ మణిపూసకు మసిపూస్తె
బొగ్గు చేసే అగ్గిపువ్వై అంకురిస్తాం
‘అమాయకపు’ ఆఖరి ఆకులు రాలిపోయినై
అరుణారుణ తెలంగాణ పోరాట కొంగ్రొత్త కుసుమాలు వికసిస్తూన్నై
ఆ’నాయుడు ‘ఈ’నాయుడు’
ఇక ఏనాయుడైనా అడ్డొస్తే
నాగమ్మ సాక్షిగా ..ఎగబడుడే తెగబడుడే
రంకు నేర్చి బొంకు నేర్చి బతక నేర్చి
మా బ్రతుకుల్ని కడతేరుస్తున్న మీకు
చితులు సిద్ధ్దమవుతున్నాయి
జానెడు పొట్టకోసం ,మూరెడు గుడ్డకోసం
సస్తే మూడు గజాల బొందకోసం
ఎందుకురా ఇంత ద్రోహం
ఎంతకాలం?ఇంకెంత కాలం??
వెయ్యేళ్ల మీ దురంహంకారం
వెయ్యి ముక్కలయ్యే.. వేకువ కోసం
కన్న పేగుల కడుపు కోతల్ని
గుక్క పట్టి ఎక్కి ఎక్కి ఎడిసే అవ్వల
దుఖా:న్ని భరించలేమిక …
మా యాసను,భాషను,ప్రాసను,గోసవెట్టి
దుర్భాషలాడి చివరికి మా చరిత్రపై ఒంటేలు పోస్తుంటే
ఇక ఆగలేము,నాగమ్మ సాక్షిగా పొలిమేర దాటిస్తాం
తెలంగాణ జెండా ఎగరేస్తాం..
జై తెలంగాణ..!
జైజై తెలంగాణ ..!!
(తెలంగాణ ఆడబిడ్డ నాగమ్మను సీమాంధ్ర చరిత్ర కారులు
వక్రికరించి ద్రోహిగా అభివర్ణించిన వైనాన్ని జీర్ణించుకోలేక పట్టరాని ఆవేదనతో..)
– సింహాచలం లక్ష్యణ్‌ స్వామి
జగిత్యాల ,కరీంనగర్‌ జిల్లా
సెల్‌:9440511239