తెలంగాణ పథకాలను కాపీ కొట్టిన బిజెపి
అందుకే అధికారానికి చేరువయ్యింది
మెదక్ జిల్లా పర్యటనలో మంత్రి హరీష్ రావు
మెదక్,మే15(జనం సాక్షి ): దేశంలో రైతు గురించి ఆలోచించిన ఒకేఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మన పథకాలకు కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. రుణమాఫీ తదితర పథకాలను కాపీ కొట్టిందని అందుకే అక్కడ అతిపెద్ద పార్టీగా బిజెపి వచ్చిందన్నారు. అయితే ఆ పార్టీకి చిత్తశుద్ది లేకపోవడం వల్ల పూర్తి మెజార్టీని పొందలేదన్నారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టుల నుండి కాలువల ద్వారా నర్సాపూర్ నియోజకవర్గంలో 65 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రకటించారు. అటవీ భూములు సాగు చేస్తున్న వారికి కూడా రైతుబంధు పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్, నర్సాపూర్‌లలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.రైతులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా గ్రామ గ్రామానికి వెళ్తూ పట్టాదారు పాస్ బుక్స్ ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. రైతులు పంటలు అమ్ముకోవడానికి అన్ని వసతులు కల్పించామన్నారు. అధికారులు రైతుబంధు పథకంలో కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు. మెదక్ జిల్లాలో 2లక్షల 15 మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా చెక్కులు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. రైతుల కోసం బ్యాంకుల్లో నగదు వుండే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూ.426 కోట్లతో హైద్రాబాద్-మెదక్ జాతీయ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో చెక్ డ్యాం నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క ఎన్నికల హావిూని నెరవేర్చలేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేసే పరిస్థితి నుండి బయటకు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం అమలు చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో హావిూలు ఇవ్వడం, వాగ్దానాలు చెయ్యడం తప్ప రైతులకు చేసింది ఏవిూ లేదన్నారు.
ఈ కార్యక్రమాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి తదితరులు పాల్గొన్నారు.