తెలంగాణ పథకాలు చారిత్రకమైనవి
అభివృద్ది,సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్ పాలన
మహబూబాబాద్ ఎంపి సీతారాం నాయక్
మహబూబాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని మహబూబాబాద్ ఎంపి సీతారాం నాయక్ అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, ఈ ఎన్నికల్లో మరోసారి ఆయనను ముఖ్యమంత్రిని చేసి గ్రామ స్వరాజ్యం స్థాపించే విధంగా సహకరించాలని కోరారు. రైతు ఆత్మహత్యల నివారణ కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టి రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. రైతు బీమా పథకంతో మృతి చెందిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పేదింటి ఆడపడుచుల పెళ్లీళ్ల కోసం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి రూ.1,00,116 ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలను ప్రారంభించి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాజకీయ పబ్బం గడుపుకునేందుకే వారు తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాటలు నమ్మకుండా అభివృద్ధిని కోరుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రస్తుతం గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని, ప్రతి గ్రామానికి రోడ్డు మార్గం వేశామని చెప్పారు.