తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా అనురాగ్‌ శర్మ

4

హైదరాబాద్‌,నవంబర్‌13(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా అనురాగ్‌శర్మ నియమితులయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇంతకాలం తాత్కాలిక డిజిపిగా ఉన్న అనురాగ్‌ శర్మను సిఎం కెసిఆర్‌ పూర్తిస్థాయి డిజిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.  తెలంగాణ ఆవిర్భావం నుంచీ తాత్కాలిక డీజీపీగా ఆయనే విధులు నిర్వహిస్తూనే శాంతిభద్రతలతో పాటు అనేక విషయాల్లో సిఎం కెసిఆర్‌కు తలలో నాలుకలా ఉన్నారు. సమర్థతను గుర్తించిన సిఎం కెసిఆర్‌ ఇప్పుడు పూర్తిస్థాయి డీజీపీగా అనురాగ్‌శర్మకే బాధ్యతలు అప్పగించాలని  నిర్ణయించారు. అనురాగ్‌శర్మ 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టకముందు కాకముందు ఆయన హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. పూర్తిస్థాయి డీజీపీ కోసం ప్యానెల్‌ అనురాగ్‌శర్మతో పాటు అరుణ బహుగుణ, ఏకే ఖాన్‌. తేజ్‌దీప్‌కౌర్‌, దుర్గాప్రసాద్‌ పేర్లను తెలంగాణ ప్రభుత్వం యూపీఎస్సీ ప్యానెల్‌ కమిటీకి ప్రతిపాదించింది. ప్యానెల్‌ కమిటీ అనురాగ్‌శర్మ, అరుణ బహుగుణ, ఏకే ఖాన్‌లలో ఒకరిని నియమించుకోవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్రం ఆవిర్భావం నుంచి సమర్థంగా పనిచేస్తున్న అనురాగ్‌శర్మ వైపే సర్కారు మొగ్గుచూపింది. రాజస్థాన్‌కు చెందిన ఆయనకు పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం.ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికైన అనురాగ్‌శర్మ రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎస్పీగా, హైదరాబాద్‌ దక్షిణ మండలం డీసీపీగా, గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా సమర్ధంగా పనిచేశారు. 1996 ఆగస్టు 9న డీఐజీగా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా పనిచేశారు. 2001లో మే 25న ఐజీగా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్‌లో చేరారు. అనంతరం కేంద్ర సర్వీసులకు ఐదేళ్ల పాటు డిప్యుటేషన్‌పై వెళ్లి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌) దక్షిణ విభాగం, శిక్షణ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడవిూ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. వివాద రహితుడిగా, సౌమ్యుడిగా పేరున్న శర్మ రాజస్థాన్‌లో 1957 ఫిబ్రవరి 2న జన్మించిన అనురాగ్‌శర్మ జీవశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. డెహ్రాడూన్‌లోని భారత అటవీ కళాశాలలో డిప్లొమా ఇన్‌ ఫారెసీ చదివారు. చెన్నైలోని లయోలా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో మానవ వనరుల నిర్వహణలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. 26 ఏళ్ల వయసులో సివిల్స్‌కు ఎంపికై 1983 ఫిబ్రవరి 10న ఐపీఎస్‌లో చేరారు. డిప్యుటేషన్‌ ముగిసిన తర్వాత రాష్గా/నికి తిరిగొచ్చి ఐజీ, అదనపు డీజీ ¬దాల్లో కీలకమైన గ్రేహౌండ్స్‌ విభాగం అధిపతిగా పనిచేశారు. ఆ తర్వాత 2012 మే 21న హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి తెలంగాణ ఉద్యమం సందర్భంలో సమర్థంగా, వ్యూహాత్మకంగా విధులు నిర్వహించి ప్రశంసలు పొందారు. హైదరాబాద్‌ సీపీగా ఆయన పనిచేసిన తీరే డీజీపీ పదవి దక్కడంలో ప్రధాన అర్హతగా మారిందని చెప్పవచ్చు.అనురాగ్‌శర్మ 1998లో రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం, 2004లో అంతరిక్‌ సురక్ష సేవా పతకం, 2007లో రాష్ట్రపతి ప్రతిష్ఠాత్మక సేవా పతకాన్ని పొందారు. తన నియామకం అనంతరం ఆయన సిఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డితో కలసి సిఎంను కలిశారు.