తెలంగాణ మరింత అప్రమత్తం

– అన్ని చర్యలు తీసుకుంటున్నాం

– రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌

హైదరాబాద్‌,డిసెంబరు 22 (జనంసాక్షి): యూకేలో కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు వైద్య, విద్య సంచాలకులు డా.రమేశ్‌ రెడ్డితో కలిసి ఆయన విూడియాతో మాట్లాడారు. కొత్త రకం వైరస్‌కు సంబంధించి కేంద్రం ఇప్పటికే పలు సూచనలు చేసిందన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌ వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అప్రమత్తం అయ్యారని శ్రీనివాస్‌ వెల్లడించారు.’నిన్న యూకే నుంచి ఏడుగురు ప్రయాణికులు తెలంగాణకు వచ్చారు. ఈ నెల 15 నుంచి 21 వరకు కేవలం యూకే నుంచే 358 మంది నేరుగా (డైరెక్ట్‌ ఫ్లైట్స్‌) శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 22 వరకు వివిధ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారందరినీ పర్యవేక్షణలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రానికి వచ్చిన వారికి శంషాబాద్‌ విమానాశ్రయంలోనే కొవిడ్‌ పరీక్ష చేశాం. అందరికీ నెగెటివ్‌ వచ్చింది. గత వారం రోజులుగా రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో 040-24651119 నంబర్‌ను ఏర్పాటు చేశాం. గత వారంలో యూకే నుంచి తెలంగాణకు వచ్చినవారు ఎవరైనా ఈ నంబర్‌ను సంప్రదించాలి. జిల్లా, రాష్ట్ర పర్యవేక్షణ బృందాలు వారి వద్దకు చేరుకొని వారి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. అవసరమైతే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తాం’ అని తెలిపారు.

ఆందోళన వద్దు..

”కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వైరస్‌లో మార్పులు సహజం. అంతేకాకుండా ఈ కొత్త రకం కరోనా వైరస్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరికీ సోకలేదు. అయితే ఈ రకం వైరస్‌ కాస్త వేగంగా వ్యాపిస్తోంది. ఈస్ట్‌ యూకేలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యాధి బారినపడి తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటివరకు నమోదు కాలేదని సమాచారం. రాబోయే వారం రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సంయుక్తంగా పరిస్థితులను అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశాం. కేవలం యూకే మాత్రమే కాకుండా స్ట్రెయిన్‌ వ్యాప్తి చెందిన ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతి ఒక్కరిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. వారం రోజులుగా ఉష్టోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. త్వరలో క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు వస్తున్నాయి. పండుగలు పూర్తయ్యే వరకు పదేళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు బయటకు రాకూడదు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి” అని వివరించారు.

వ్యాక్సిన్‌ పంపిణీకి చర్యలు..

”కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కరోనా టీకా డోసులు రాగానే ప్రణాళిక మేరకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. పంపిణీ విషయంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు చేపట్టాం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం. దాదాపు 3కోట్ల మేర టీకా డోసులను నిల్వ చేసేలా కోల్డ్‌ స్టోరేజీలను విస్తృతం చేస్తున్నాం” అని డా.శ్రీనివాస్‌ వెల్లడించారు.