‘తెలంగాణ మార్చ్’కు ఉప్పెనలా తరలిరండి
అన్ని వర్గాలను కలుపుకుని కవాతును నిర్వహిస్తాం
తెలంగాణవాదుల మధ్య ఎలాంటి విభేదాలూ లేవు
కావాలనే సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం
టీజేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్, ఆగస్టు 8 (జనంసాక్షి) :
సెప్టెంబర్ 30న టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘తెలంగాణ మార్చ్’కు పార్టీలు, సంఘాలకతీతంగా తరలిరావాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. బుధవారం తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కోదండరాం అధ్యక్షతన జరిగింది. ఈ సమా వేశంలో కమిటీ సభ్యులు పలు కీలక తీర్మానాలు చేశారు. సమావేశం అనంతరం టీజేఏసీ చైర్మన్ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేంతుకు అన్ని వర్గాలను ఏకం చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు కూడా కులమతాలకు, పార్టీలకు, సంఘా లకు అతీతంగా కవాతుకు తరలిరావాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ఉద్యమం భాగస్వాముల వుతున్న ఆయా సంఘాలు ఈ మార్చ్ ఆవశ్య కతను ప్రజలకు వివరించి జయప్రదం చేసేం దుకు కృషి చేయాలన్నారు. కమిటీ సమావేశంలో స్పష్టమైన ఉద్యమ కార్యాచరణ రూపకల్పనపై చర్చించినట్లు కోదండరాం తెలిపారు. కొందరు కావాలనే తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారని, దీనికి సీమాంధ్ర మీడియా ఆజ్యం పోస్తున్నదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా సీమాంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమంపై దుష్ప్రచారాన్ని మానుకో వాలని కోదండరాం హితవు పలికారు. తెలంగాణవాదుల్లో, జేఏసీలో భేదాభిప్రాయాలు వస్తున్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇదంతా సీమాంధ్రుల కుట్రపూరిత పన్నాగాలని ఆరోపించారు. తెలంగాణవాదులంతా ఏకంగానే ఉన్నారని, అసత్య వార్తలను ప్రజలు నమ్మవద్దని కోరారు. తెలంగాణవాదులు ఎప్పటికీ విడిపోరని, ఉద్యమ పంథా వేరు కావచ్చు గానీ, అందరి లక్ష్యం మాత్రం తెలంగాణ సాధనేనని కోదండరాం వివరించారు. ప్రజలు ఊహగానాలను నమ్మకుండా, సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టేలా సెప్టెంబర్ 30న జరుగు ‘తెలంగాణ మార్చ్’కు భారీగా తరలివచ్చి, విజయవంతం చేయాలని ఆయన పునరుద్ఘాటించారు. అదే విధంగా, ఆయా జేఏసీల నాయకులు మార్చ్ విజయవంతమయ్యేలా, ప్రజలను చైతన్యపర్చాలని కోదండరాం పిలుపునిచ్చారు.