తెలంగాణ రాకుంటేనే … నక్సలైట్లు పెరుగుతరు
తెలంగాణపై రాజీలేని పోరాటం
హైదరాబాద్ మార్చ్‌లో అన్ని పార్టీలు పాల్గొనాలి
జేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్, సెప్టెంబర్ 12 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, నక్సలైట్ సమస్యకు కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ముడిపెట్టడంపై తెలంగాణ జెఎసి మండిపడుతోంది. ఈ విషయంపై తాము షిండేకు లేఖ రాస్తామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కొందరామ్ చెప్పారు. తెలంగాణ వస్తే కాదు, తెలంగాణ రాకుంటేనే నక్సలైట్ సమస్య పెరుగుతుందని ఆయన అన్నారు. బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30వ తేదీన జరిగే తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు సన్నాహక కార్యక్రమాలను తెలంగాణ జెఎసి ఖరారు చేసింది. తెలంగాణలో నక్సలైట్లు ఉన్నారా, ఆంధ్రలో నక్సలైట్లు ఉన్నారా అనేది షిండే తేల్చాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. గురువారం సకల జనుల సమ్మె పునరంకిత దీక్షలు చేపట్టాలని ఆయన తెలంగాణ ఉద్యోగులకు పిలునిచ్చారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఉద్యోగుల పునరంకిత దీక్ష ఉంటుందని కోదండరామ్ చెప్పారు. తెలంగాణ మార్చ్‌లో అధికార, ప్రతిపక్షాల నాయకులు పాల్గొనాలని సూచించారు. ఇదిలా ఉండగా ఈ నెల 17వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ విద్యార్థుల ఆత్మగౌరవ యాత్రలు చేపట్టాలని ఒయు జెఎసి, తెలంగాణ జెఎసి నిర్ణయించాయి. ఈ నెల 30లోగా తెలంగాణ ప్రకటన చేయకుంటే రాజభవన్‌ను ముట్టడిస్తామని ఓయూ జెఎసి హెచ్చరించింది. అక్టోబర్1వ తేదీన ప్రపంచ జీవ వైవిద్య సదస్సును కూడా అడ్డుకుంటామని హెచ్చరించింది. కాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో బిజెపి నాయకులు బుధవారంనాడు సమావేశమయ్యారు. ఈనెల 17 వతేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే తాము జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తామని బిజెపి నాయకులు ఇప్పటికే చెప్పారు.