తెలంగాణ రైజింగ్‌ సన్‌

` పెట్టుబడుల్లో దూసుకెళ్తున్నాం
` ఆపడం ఎవరితరం కాదు
` దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు సాధించాం
` అన్ని రంగాల్లో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది
` హెచ్‌సిఎల్‌ టెక్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని, 2025వ సంవత్సరంలోనే దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు సాధించామని, తెలంగాణ వన ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇవి, బయోటెక్‌ సహా తదితర రంగాల్లో హైదరాబాద్‌ అగ్రగామిగా ఉందని ప్రశంసించారు.మాదాపూర్‌లో హెచ్‌సిఎల్‌ టెక్‌ నూతన క్యాంపస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. నూతన హెచ్‌సిఎల్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ దేశంలోనే అత్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారిందని కొనియాడారు. దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్‌ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాదిలోనే దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఉద్యోగ కల్పనలో నంబర్‌వన్‌గా నిలిచామని చెప్పారు. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానన్నారు. ‘తెలంగాణను 1 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తానని నేను చెప్పినప్పుడు అది సాధ్యం కాదని కొందరన్నారు. రెండుసార్లు దావోస్‌ పర్యటనల్లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తరువాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారు. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. మా పోటీ ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు.. కొంతమంది అది పెద్ద కలనే అవుతుందన్నారు. ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్‌ వన్‌గా చేశాక.. రాష్టాన్న్రి డేటా సెంటర్లు, గ్రీన్‌ ఎనర్జీ, లైఫ్‌ సైన్సెస్‌, బయో టెక్నాలజీ, స్కిల్స్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, అగ్రి ప్రాసెసింగ్‌ హబ్‌గా మారుస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌ రైజింగ్‌ ఆగదు అని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్‌ను ఇటీవలే ప్రారంభించాం. ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాల్లో ఒకటైన బయో ఆసియా సదస్సును నిర్వహించాం. గ్లోబల్‌ కంపెనీగా హెచ్‌సీఎల్‌ టెక్‌ దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇది 2.2 లక్షల మందికిపైగా ఉద్యోగులతో 60 దేశాల్లో ఆపరేట్‌ చేస్తోంది. డిజిటల్‌, ఇంజినీరింగ్‌, క్లౌడ్‌, ఏఐ రంగాల్లో వరల్డ్‌ క్లాస్‌ ఆఫరింగ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. 2007లో హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి హెచ్‌సీఎల్‌ అంచలంచెలుగా పెద్ద స్థాయికి ఎదిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఐటిశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.

 

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారంపై ప్రభుత్వం చొరవ
వివాదాల పరిష్కారానికి అంగీకారం
ఎమ్మార్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ సమీక్ష
హైదరాబాద్‌(జనంసాక్షి): ఎమ్మార్‌ ప్రాపర్టీతో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వారి న్యాయకమిటీ అందించే సూచనలు,సలహాలు స్వీకరిస్తామని తెలిపింది. వివిధ కేసులతో పెండిరగ్‌లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఎమ్మార్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎమ్మార్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహమ్మద్‌ అలబ్బర్‌, భారత్‌ లో యూఏఈ మాజీ రాయబారి డాక్టర్‌ అహ్మద్‌ అల్‌ బన్నా, ఎమ్మార్‌ గ్రూప్‌ సీఈవో అమిత్‌ జైన్‌, ఆ కంపెనీ ఇంటర్నేషనల్‌ అ్గªర్స్‌ హెడ్‌ ముస్తఫా అక్రమ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి,పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్‌కు చెందిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ హైదరాబాద్లో కన్వెన్షన్‌ సెంటర్‌, హోటల్‌, గోల్ఫ్‌ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015 అక్టోబర్‌లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి ఛీప్‌ సెక్రెటరీ సారధ్యంలో అయిదుగురు సెక్రెటరీల కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్ర విదేశాంగశాఖ, సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకూడా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఎమ్మార్‌ ప్రతినిధులతో జరిగిన చర్చల సందర్భంగా ఈ అంశాలన్నింటినీ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, ఛార్జీ షీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఎమ్మార్‌ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్నంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015లో చీఫ్‌ సెక్రటరీ నేత్రుత్వంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్య పూర్వక పరిష్కారం చేసుకోవడానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించగా, వారి ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ వారితో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని చెప్పారు.

తెలంగాణలో మిస్‌వరల్డ్‌ పోటీలు

` మే 7 నుంచి 31 వరకు గ్రాండ్‌ ఫినాలె
` వరల్డ్‌ ఫెస్టివల్‌లో 120కి పైగా పాల్గొననున్న దేశాలు
హైదరాబాద్‌(జనంసాక్షి): మిస్‌ వరల్డ్‌ పోటీలు అంటే ప్రపంచంలోనే ఓ అరుదైన, అద్వితీయమైన వేడుక. వివిధ దేశాల నుంచి సుందరీమణులు పాల్గొనే ఈ వేడుకలకు ఈసారి తెలంగాణలోని హైదరాబాద్‌ వేదిక కానుంది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వడం అనే మాట వింటుంటేనే హైదరాబాద్‌ జోష్‌ పెంచుతుంది. ఒక్కసారి ప్రపంచం దేశాలన్ని హైదాబాద్‌ వైపు చూపుతిప్పుకునే ఆ రోజు అతి చేరువలోనే ఉంది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీలకు హైదరాబాద్‌లో చెయ్యాలని నిర్వాహకులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది. చారిత్రక, వారసత్వ సంపదను ప్రపంచానికి చాటడానికి తెలంగాణకు ఇదొక గొప్ప అవకాశం కానుంది. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటేందుకు అరుదైన ఘట్టం కానుంది. ఈ ఏడాది అందాల పోటీలకు అనువైన ప్రదేశంగా తెలంగాణను ఎంచుకోవడం, అందులోనూ హైదరాబాద్‌ వంటి మహానగరం ఈ వేడుకులకు సిద్దమవ్వడం ఈ ప్రభుత్వంలో జరిగే ఓ అద్వితీయం వేడుకగా చెప్పవచ్చు. ఈ ఏడాది మేనెలలో నాలుగు వారాల పాటు జరిగే ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతోపాటు గ్రాండ్‌ ఫినాలేను సైతం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మక మిస్‌ వరల్డ్‌ ఫెస్టివల్‌లో 120కి పైగా దేశాలు పాల్గొంటాయి. బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మిస్‌ వరల్డ్‌ అందాల పోటీల్లో పాల్గొనే దేశ విదేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలకబోతుంది. మే 7 నుంచి ఈ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. మే 31న గ్రాండ్‌ ఫినాలే ఉంటుంది. ప్రస్తుత మిస్‌ వరల్డ్‌ తర్వాత అందాల సుందరి కిరీటాన్ని ఎవరు ధరిస్తారో గ్రాండ్‌ ఫినాలే రోజు తేలనుంది. గతంలో న్యూఢల్లీి, ముంబైలో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. 71వ ఎడిషన్‌ ముంబైలోనే జరిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న హైదరాబాద్‌ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేడుకలకు వేదికైంది. ఐటీ, ఫార్మాసూటికల్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణకు ఈ అవకాశం దక్కడం నిజంగా గర్వించదగ్గ విషయమే. తెలంగాణను పర్యాటకంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు ఇప్పటికే సిద్దం చేసినట్లు సమాచారం. తెలంగాణ జరూర్‌ ఆనా నినాదంతో టూరిజం శాఖ దేశ విదేశీ పర్యాటకులను ఇప్పటికే ఆహ్వానాలు పంపుతోంది. గొప్ప చేనేత వారసత్వం, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, అరుదైన వంటకాలు, విభిన్నమైన కళా వారతస్వమున్న తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలను స్వాగతిస్తున్నామని.. మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చైర్మెన్‌, సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ తాజాగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసారు. మిస్‌ ఇండియా పోటీలు అంటేనే సుందరీమణుల అలరిస్తారు. అందులోనూ మిస్‌ వరల్డ్‌ పోటీలు అంటే ఇంక మాటల్లో చెప్పక్కర్లేదు. ఎంత ఆహ్లదంగా ఉంటుంతో, అంతే స్థాయిలో వివిధ దేశాల యువతుల మధ్య గట్టిపోటీ కూడా సర్వసాధారణం. ఈ పోటీల వేదికగా హైదరాబాద్‌ బ్రాండ్‌ వాల్యూని మరింత పెంచడంతోపాటు, ప్రపందేశాల ప్రతినిధులను ఆకట్టుకునేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేసింది తెలంగాణ ప్రభుత్వం.