తెలంగాణ వాసికి అంతర్జాతీయ పురస్కారం

 గ్లోబల్ పీస్ అవార్డు అందుకున్న
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చెందిన డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్
* చెన్నై లో ప్రఖ్యాత శాస్త్రవేత్త, అమెరికన్ యూనివర్సిటీ ఛాన్స్ లర్, శాంతిదూత  డాక్టర్ మధు కృషన్ చేతుల మీదుగా అందజేత
మిర్యాలగూడ. జనం సాక్షి
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో  మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ప్రతిష్టాత్మక గ్లోబల్ పీస్ అవార్డుకు ఎంపికయ్యారు. జనయేత్రి ఫౌండేషన్ స్థాపించి పొరుగు రాష్ట్రాల్లోనూ తన సేవలను విస్తరించిన అనతి కాలంలోనే ఆయన ఈ పురస్కారానికి ఎంపిక కావడం గమనార్హం. మానవ హక్కుల సాధనలో అవిరామంగా కృషి చేయడంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం నిస్వార్థ సేవలను నిర్వర్తిస్తున్న డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ను అంతర్జాతీయ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు కార్యక్రమ నిర్వాహకులు, ఫిలాన్ త్రోపిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా గ్లోబల్ పీస్, కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అద్దంకి రాజా తెలిపారు. శనివారం చెన్నై నగరంలో టి.నగర్ సోషల్ క్లబ్ లో నిర్వహించిన అంతర్జాతీయ శాంతి సదస్సులో  ప్రఖ్యాత శాస్త్రవేత్త, శాంతి దూత డాక్టర్ మధు కృషన్ చేతుల మీదుగా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గ్లోబల్ పీస్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ను డాక్టర్ మధు కృషన్ శాలువాతో ఘనంగా సత్కరించి పురస్కారంతో పాటు పతకం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ మధు కృషన్ మాట్లాడారు. సమాజ సేవలో డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ అభినందనీయుడని కొనియాడారు. ఓ వైపు వైద్య వృత్తిలో తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే  తన సమయంలో సింహభాగం సామాజిక సేవా కార్యక్రమాల కోసం సద్వినియోగం చేస్తున్న  డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ వంటి సోషల్ వర్కర్స్  సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన సేవలు కొనసాగుతున్నాయని కొనియాడారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజాసేవే తన అభిమతంగా భావించి ఎందరో నిరుపేదలకు తన శక్తివంచన మేరకు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ సేవలందించారని అన్నారు. ఆపదలో ఉన్న రోగులకు రక్తదానం చేయడం కోసం రక్తదాతల ప్రత్యేక వాట్సాప్ గ్రూపు నిర్వహించడం ఆయన సామాజిక సేవా సుగుణానికి అద్దం పడుతున్నదని అభివర్ణించారు. అన్ని కాలాల్లో ఆయన సేవలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయంటే ఆయనకు అల్లా దీవెనలు మెండుగా ఉన్నాయని అర్ధమని అన్నారు.
మండుటెండల్లో బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, ఎముకలు కొరికే చలిలో నిర్భాగ్యులకు దుప్పట్లు పంపిణీ, వానాకాలంలో కడు పేదలకు, యాచకులకు ఆహారం పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను తన మదిలో చిరకాలం నిలిచిపోతాయని అన్నారు. అదేవిధంగా, డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ వెన్నంటే ఉండి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా  భాగస్వామ్యమవుతున్న జనయేత్రి ఫౌండేషన్ సభ్యులందరికీ తన అభినందనలు తెలియజేస్తున్నట్టు డాక్టర్ మధు కృషన్ పేర్కొన్నారు. కాగా, తన సేవలను గుర్తించి అంతర్జాతీయ శాంతి పురస్కారానికి తెలంగాణ రాష్ట్రం నుంచి తనను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు
జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు
డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ అవార్డు స్వీకరణ అనంతరం తన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిండు నూతనోత్సాహంతో ఇంకా బాగా కష్టపడి సమాజ అభ్యున్నతి కోసం పాటుపడతానని అన్నారు. తన అమ్ముల పొదిలో మరో అవార్డు వచ్చి చేరిందని, అంతర్జాతీయ శాంతి పురస్కారం తనకు దక్కడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉన్నదని  డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఛాప్టర్ పీస్ అంబాసిడర్ డాక్టర్ ఉషా కిరణ్ రాయ్, ఖమ్మం జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ డాక్టర్ వేల్పుల విజేత, పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.
Attachments area
 

తాజావార్తలు