తెలంగాణ వ్యక్తినే వీసీగా నియమించాలి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌
హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌గా తెలంగాణ వ్యక్తిని నియమించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన విశ్వవిద్యాలయాల్లో ఆ ప్రాంతం వారిని వీసీలుగా నియమించాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌రెడ్డి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహ రిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌గా పద్మరాజును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్‌ తిరస్కరిం చాలని ఆయనకోరారు. ఈ విశ్వవిద్యాలయానికి కేటా యించిన వంద కోట్ల రూపాయలను సీమాంధ్ర ప్రాంతానికి తరలించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశ్వ విద్యాలయాల్లో 80 శాతం వరకు సీమాంధ్ర వారే పెత్తనం చెలా యిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్జీరంగా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ నియామకంలో ప్రభుత్వం నాటకాలాడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతానికి సీఎం వివక్ష చూపుతున్నారన్నది నూటికి నూరు పాళ్లు నిజమని ఆయన అన్నారు. తెలంగాణలో ఎక్కువగా పండించే పత్తి, మిర్చి పరిశోధన కేంద్రాలు ఈ ప్రాంతంలో లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రాంతంలోనే ఈ పంటల పరిశోధన కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న నేతల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయనపిలుపు నిచ్చారు. తెలంగాణ ద్రోహులను చట్టసభల్లోకి రాకుండా ప్రజలు అడ్డుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌, బీజేపీలు సాంకేతికంగానే జాతీయ పార్టీలు అని ఆయన అన్నారు. ఆ పార్టీల పరిస్థితి పెద్ద ప్రాంతీయ పార్టీల పరిస్థితిగా మారిందని ఆయన అన్నారు. అధికారం కోసం బీజేపీ నాటకాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. కాకినాడలో బీజేపీ చేసిన తీర్మానాన్ని కాకి ఎత్తుకెళ్లిందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణపై చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్లమెంట్‌లో బిల్లు పెడితే మద్దతు ఇస్తామని స్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీమాంధ్ర పార్టీల రంగు బయటపడడం వల్లే ఆ పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణకు కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్‌ సీపీలు చేస్తున్న మోసాన్ని ప్రజలు గ్రహించారని ఆయన అన్నారు.

తాజావార్తలు