తెలుగునేలను తాకిన నైరుతి

అనంతపురంలో ప్రవేశించిన వానమ్మ

అమరావతి,జూన్‌4(జ‌నం సాక్షి): తెలుగునేలను నైరుతి పలకరించింది. వానకబురు అందించింది.రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. సోమవారం అనంతపురం జిల్లా విూదుగా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు.. రెండ్రోజుల్లో రాయలసీమ, మహారాష్ట్ర ప్రాంతాలకు పూర్తిగా విస్తరిస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. క్యుములోనింబస్‌ మేఘాల వల్ల ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. గత రెండ్రోజులుగా కోస్తాలో మినహా మిగిలిన చోట్ల ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గాయి. ఎక్కడా 40 డిగ్రీలు దాటలేదు. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లా వత్సవాయిలో అత్యధికంగా 8 సెం.విూల వర్షపాతం నమోదైంది. ఇదిలావుంటే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు ఉరుములు మెరుపులు, ఈదురుగాలుల ప్రభావం కూడా బాగా ఉండే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.