తెలుగు యాస భాషను కాపాడింది కాళోజీ నారాయణరావు

-కలెక్టర్ శశంక

మహాబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్9(జనంసాక్షి)

తెలంగాణ భాష, యాస, సాంప్రదాయాలను కాపాడేందుకు పోరాడిన గొప్ప వ్యక్తి కాళోజీ నారాయణ రావు అని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్ లో జరిగిన కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ కె. శశాంక, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మరో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన ప్రాంత అస్తిత్వం భాష తెలంగాణ యాస కోసం కాళోజీ నారాయణ రావు సుధీర్ఘ పోరాటం చేసారని, పద్మ విభూషణ్ గ్రహీత అయిన వారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం మనందరిపై ఉందని కలెక్టర్ తెలిపారు. సామాజిక కార్యకర్తగా నిరాడంబర రాజకీయ వేత్తగా, కవి, రచయిత గా వారు అందించిన సేవలను తెలుసుకోవటం తో పాటు వారి రచనలు చదవటం ద్వారా పూర్తి స్థాయిలో వ్యక్తిత్వం ఏర్పడుతుoదన్నారు. చనిపోయిన తరువాత కూడా వారి అవయవాలను కాకతీయ మెడికల్ కాలేజి కి దానం చేసిన గొప్ప వ్యక్తీ కాళోజీ నారాయణ రావు అని అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ తెలుగు తో పాటు హింది, మరాఠీ వివిధ బాషలలో కాళోజీ నారాయణ రావు రచనలు ప్రసిద్ది చెందాయని వారి రచనలను ప్రతి ఒక్కరు చదవటంతో పాటు నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ అన్నారు. ఇటువంటి వేడుకలు నిర్వహించుకోవటం ద్వారా వారి సేవలను స్మరించుకోవడం తో పాటు స్ఫూర్తి పొందాలన్నారు. శిక్షణ కలెక్టర్ పరమర్ పింకేశ్వర్ కుమార్ లలిత్ కుమార్, డీఆర్డీఓ సంయాసయ్య, డిపిఓ సాయిబాబా, జెడ్పీ సిఈఓ రమాదేవి, కలెక్టరేట్ ఏఓ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.