తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ

6666హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వచ్చేసింది. ఓ వైపు పల్లెలు కళకళలాడుతున్నాయి. మరోవైపు రాజధాని బోసిబోతోంది. పల్లెల వైపు నగరవాసులు పరుగులు తీస్తున్నారు. ఆత్మీయుల మధ్య ఆహ్లాదంగా గడిపేందుకు తరలిపోతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. రైళ్లు, బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంక్రాంతికి సొంతూళ్లకు… ప్రయాణం నరకం
  సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణిలకులతో హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, లక్డీకాపూల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాలు బస్సుల కోసం ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌ అదనపు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిపోవడం లేదు. కూకట్‌పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు బస్సులు బయలుదేరడంతో జాతీయరహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎర్రగడ్డ నుంచి అమీర్‌పేట వరకు వాహనాలు కదలక ప్రయాణీకులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వేషన్‌ చేసుకున్నవారు సమయానికి బస్సులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
రైల్వేస్టేషన్‌లలో సంక్రాంతి కళ

భాగ్య నగరంలోని రైల్వేస్టేషన్‌లలో సంక్రాంతి కళ కనిపిస్తోంది. సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. అన్ని రైళ్లలనూ ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. రైల్వే రిజర్వేషన్లు నెల ముందే చేసుకున్నారు. అప్పటికప్పుడు వెళ్లాలనుకున్న చాలా మంది తత్కాల్‌నే నమ్ముకున్నారు. పేద ప్రజలు మాత్రం జనరల్‌ బోగీల్లోనే అతికష్టం మీద వెళ్తున్నారు. అదీ కుదరకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ 

ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ ప్రధాన బస్‌స్టేషన్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్‌లతో పాటు శివారు ప్రాంతాల్లోని బస్‌స్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. అదనపు రైళ్లు, బస్సులు ఎన్ని వేసినా ఫలితం లేదు. ప్రయాణికులు రద్దీ ఏ మాత్రం తగ్గటం లేదు.  దీంతో సొంతూళ్లకు వెళ్తున్న జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అదనపు బస్సులు 

మరోవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అదనపు బస్సులు కేటాయించామంటున్నారు. ప్రయాణికుల రద్దీ బట్టి వాటి సంఖ్యను మరింత పెంచుతామని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి నగరవాసులకు సంక్రాంతి చుక్కలు చూపిస్తోంది. ఊళ్లకు వెళ్లాలంటే నానా పాట్లు పడక తప్పటం లేదు. కిక్కిరిసిన రైళ్లు, బస్సుల్లో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కువ మొత్తంలో చార్జీలు వెచ్చించి ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నారు.