తొలకరితో తొందరపడవద్దు
రెండుమూడు వర్షాల తరవాతనే సాగు చేపట్టాలి
నల్లగొండ,జూన్15(జనం సాక్షి ): తొలకరి వర్షాలకు రైతులు విత్తనాలు నాటుకోవద్దని, రెండు, మూడు వర్షాలు పడ్డాక అదును చూసి విత్తనాలు నాటుకుంటే మంచిదని జేడీఏ నర్సింహారావు సూచించారు. విత్తనాల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, లైసెన్స్ కలిగిన ఫర్టిలైజర్ దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయడంతోపాటు విధిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. రూ.5 లక్షల రైతు బీమా పథకంపై గ్రామాల్లో రైతులకు ఏఈఓలతో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగం గా సబ్సిడీపై ప్రతి మండలానికి 10 వరి కోత యంత్రాలను అందజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అన్నారు. వానాకాలం సీజన్‌లో రైతులకు అందజేసేందుకు 26వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ఈసారి వానాకాలంలో 8 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారని, వరి, జీలుగు, పెసర, కందులు తదితర విత్తనాలను ఆయా మండలకేంద్రాల్లోని సహకార సంఘాలు, గ్రోమోర్ కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేటుగా కొనుగోలు చేసేందుకు గానూ హైబ్రీడ్‌కు చెందిన 13 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 50వేల టన్నుల యూరియా రైతులకు అందజేసేందుకు సిద్‌ధ్దంగా ఉందని, మరో లక్షా 50వేల టన్నుల ఎరువుల కోసం ప్రభుత్వానికి ఇండెంట్ పంపినట్లు వివరించారు. అయితే ఇందుకు 49, 300 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా ఇప్పటికే 26వేల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచింది.