తోకలేని పిట్టతో సమాచారం సావు కబురు సల్ల

ఉరి తీశాక మూడు రోజులకు గమ్యం చేరిన ‘స్పీడ్‌పోస్ట్‌’
అఫ్జల్‌గురు కుటుంబ సభ్యుల అసహనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) :
శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం ఉరిశిక్ష అమలు సమాచారాన్ని చేరవేసేందుకు స్పీడ్‌పోస్ట్‌ను ఎంచుకొంది. పోస్టల్‌ శాఖ అంటేనే ఆలస్యానికి కేరాఫ్‌ అనే అపవాదు ఉంది. టెలీఫోన్‌, సెల్‌ఫోన్‌, ఈమెయిల్‌ అడ్రస్‌లు వచ్చిన తర్వాత సమాచారం చేరవేతలో పోస్టల్‌ శాఖ ప్రమేయం గణనీయంగా తగ్గింది. ముఖ్యమైన సమాచారం చేరవేతకు పోస్టల్‌ శాఖపై ఆధారపడేందుకు సామాన్యులు వెనుకంజ వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న కేంద్ర జైళ్ల శాఖ ఉరితీత సమాచారం అందించేందుకు స్పీడ్‌పోస్ట్‌ను మార్గంగా ఎంచుకోవడం వెనుక అనేక సమాధానం లేని ప్రశ్నలున్నాయి. పార్లమెంట్‌లో దాడి కేసులో దోషిగా పేర్కొనబడి ఉరిశిక్ష విధించిన అఫ్జల్‌గురు ఇన్నాళ్లుగా ఢిల్లీలోని తీహార్‌ జైళ్లో బందీగా ఉన్నాడు. ఆయన 2006 రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ను ఈనెల 3న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్క రించారు. ఆ వెంటనే హోం మంత్రిత్వ శాఖ ఈనెల 9న అఫ్జల్‌గురును ఉరితీయాలని నిర్ణయించింది. ఇదే సమాచారం తీహార్‌ జైలు అధికారులకు తెలిపింది. ఉరితీసేందు ఖైదీకి తన కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వని అధికారులు, ఉరి సమాచా రాన్ని కూడ సకాలంలో చేరవేయ లేకపోయారు. ఈనెల 9న ఉదయం 8 గంటలకు అఫ్జల్‌గురును ఉరితీస్తామని పేర్కొంటూ ఈనెల 6న తీహార్‌ సెంట్రల్‌ జైళ్లోని జైలు నం.3 అధికారులు ఆయన భార్య తబుస్సుమ్‌కు స్పీడ్‌పోస్ట్‌లో లేఖ పంపారు. లేఖ నం. ఎఫ్‌3/ఎస్‌సీ13/ ఏఎస్‌(డబ్ల్యూ)/2013/189 ను గత బుధవారం తబుస్సుమ్‌, సిర్‌జాగీర్‌, సాపూర్‌ (పోస్ట్‌), బారాముల్లా (జిల్లా), జమ్మూకాశ్మీర్‌ చిరునామాకు పంపారు. అఫ్జల్‌గురును హోంశాఖ నిర్ణయించిన ప్రకారం ఈనెల 9నే అధికారులు ఉరితీశారు. అనంతరం హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే మీడియాతో మాట్లాడుతూ, ఈ సమాచారం గురు కుటుంబ సభ్యులకు తెలియపరిచినట్లుగా చెప్పారు. కానీ తమకు ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని, టీవీ చానెళ్లలో కథనాలు చూసే తెలుసుకున్నామని అతడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతకూ జైలు అధికారులు పంపిన లేఖ ఏమైందంటే ఈనె 11 (సోమవారం) గమ్యస్థానానికి చేరుకుంది. ఆ లేఖను గురు కుటుంబ సభ్యులు మీడియాకు చూపి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అఫ్జల్‌గురును ఉరితీసి కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వరా అంటూ మండిపడ్డారు. ఇకపోతే ఇండియన్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ తన తీరు మార్చుకోలేదని, స్పీడ్‌పోస్ట్‌ అర్థాన్ని కూడా మార్చేసిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.