త్రిపురలో భారీ వర్షాలు

30brk104-tripuraలీటర్‌ పెట్రోలు రూ.300
నిత్యావసరాలు సైతం లభించని పరిస్థితి

అగర్తలా: భారీ వర్షాలు త్రిపుర రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నిత్యావసర వస్తువులు సైతం దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ధరలు ఆకాశానంటుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. లీటరు పెట్రోలు రూ.300 పలుకుతుండగా, డీజిల్‌ రూ.150 అమ్ముతున్నారు. దీంతో సాధారణ ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది.

మరోపక్క భారీ వర్షాలకు ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరదనీరు రోడ్లను ముంచెత్తుతోంది. వరద నీటితో వస్తున్న బురదతో రోడ్లన్నీ నిండి రవాణాకు తీవ్రం అంతరాయం ఏర్పడింది. దీంతో నిత్యావసర సరకులను రవాణా చేసే వాహనాలు జాతీయ రహదారులపైనే ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి.

పెట్రోలు ధరలు మండుతుండటంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. పెట్రోల్‌ బంకుల ఎదుట టైర్లకు నిప్పుపెట్టి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయానికి వెళ్లే రహదారులను ప్రతిపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు దిగ్బంధించారు.

ప్రజల నిత్యావసరాల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సరి-బేసి పద్ధతిలో పెట్రోలు సరఫరాకు ఆదేశాలు జారీ చేసింది.