త్రివర్ణపతాకం ఎగురవేయడానికి యత్నించిన వ్యక్తి

– దాడికి పాల్పడిన స్థానికులు
– శ్రీనగర్‌లో కలకలం
– కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
జమ్మూకాశ్మీర్‌, ఆగస్టు15(జ‌నం సాక్షి) : దేశమంతా 72వ స్వాతంత్రదినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా మంగళవారం జమ్మూ కశ్మీర్‌ రాజధానిలో శ్రీనగర్‌లో కలకలం రేగింది. జాతీయపతాకాన్ని ఓ వ్యక్తి ఎగురవేయడానికి యత్నించాడని కొందరు అతడిపై దాడి చేశారు. లాల్‌చౌక్‌ సవిూపంలోని క్లాక్‌ టవర్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. శ్రీనగర్‌ వాణిజ్య కేంద్రమైన లాల్‌చౌక్‌లో ఓ వ్యక్తి జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ప్రయత్నించడంతో స్థానికులు వ్యతిరేకించి, ఆందోళన చేపట్టారు. అతడిపై దాడిచేయడంతో స్వల్పంగా గాయపడ్డాడు. తక్షణమే సీఆర్పీఎఫ్‌ బలగాలు, పోలీసు సిబ్బంది చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై జమ్మూ కశ్మీర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం.. లాల్‌చౌక్‌లోని ఘంటాగడ్‌కు మంగళవారం మధ్యాహ్నం రాజకీయ పార్టీలకు చెందిన కొందరు వచ్చారని, జెండాను ఆవిష్కరించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు భయపెట్టి భంగం కలిగించారని అన్నారు. దీనిపై మైసుమా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. మరోవైపు 72వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారని.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానికులు నిరసనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని స్థానిక విూడియా తెలిపింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జాతీయ పతాకం ఎగురవేయడం గురించి కాదు, ధైర్యముంటే శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఎగురవేయండి అంటూ గతేడాది స్వాతంత్రదినోత్సవం సందర్భంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించి శివసేనకు చెందిన జమ్మూ కశ్మీర్‌ విభాగం అక్కడకు వెళ్లి త్రివర్ణ పతాకం ఆవిష్కరించింది. అయితే డిసెంబరులో అక్కడ త్రివర్ణ పతాకాన్ని కొంత మంది యువకులు తొలిగించారు. కానీ మరోసారి భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ మరి కొందరు యువకులు జెండాను ఎగురవేశారు.
—————————