త్వరలోనే ఇంటింటికి మంచినీరు

సంగారెడ్డి,జూలై6(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఈ ఏడాదిలోగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తామని నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌కు సాగు- తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో అమలుపరుస్తామన్నారు. ఖేడ్‌ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.ఉమ్మడి పాలనలో ఖేడ్‌ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమంలో బోధన జరిగే విధంగా 528 గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదని అన్నారు. గురుకులాల్లో ప్రైవేటుకు దీటుగా ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన సాగుతుందన్నారు. గురుకులాల్లో చదువుకునే ఒక్కో విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధించేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు కార్పొరెట్‌ విద్యను అందించడానికి సీఎం కేసీఆర్‌ గురుకుల పాఠశాలలను నెలకొల్పారని అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలను అంగన్‌వాడీ ఉపాధ్యాయులుగా గుర్తించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని సంగారెడ్డిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.

—————-