త్వరలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌!

4

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రాథమిక కసరత్తు జరుగుతున్నది. టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు 9 నోటిఫికేషన్ల ద్వారా 2,626 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో రాతపరీక్షలను పూర్తిచేసింది. అయితే ఇవన్నీ ఇంజినీరింగ్, డిప్లొమా వంటి సాంకేతిక చదువులు పూర్తిచేసిన వారికి చెందినవి. దీంతో సాధారణ డిగ్రీలు పూర్తిచేసిన వారికి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదనే భావనను పలువర్గాలు వ్యక్తం చేశాయి.

మరోవైపు గ్రూప్2 కేటగిరీలో తక్కువ పోస్టులు ఉండటం వల్ల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఆలోచనలో పడింది. కొలువుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. సీరియల్ లాగా సాగుతున్న ఉద్యోగుల విభజన పెద్దఅడ్డంకిగా మారింది. దీంతో గ్రూప్2పై ఉద్యోగార్థుల నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఉద్యోగార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన పదేండ్ల వయోపరిమితి సడలింపు సౌలభ్యాన్ని ఈ జాప్యం వల్ల ఉద్యోగార్థులు కోల్పోయే అవకాశముంది.

ఈ పరిణామాలన్నింటి రీత్యా త్వరలో గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీలో అంతర్గత కసరత్తు సాగుతున్నట్లు సమాచారం. అందుబాటులో ఉన్న పోస్టులు, త్వరలో ఏర్పడే ఖాళీలు, వయోపరిమితి వల్ల కలిగే సౌలభ్యాలు, జాప్యం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, క్రీమీలేయర్ ఆదేశాల వంటి అంశాలపై టీఎస్‌పీఎస్సీ సమీక్షిస్తున్నట్టు తెలుస్తున్నది.