థాయచి గుహ నుంచి మరో బాలుడికి విముక్తి

న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): థాయిలాండ్‌ గుహ నుంచి మరో బాలుడిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఆ బాలుడిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినట్లు థాయి నేవీ అధికారి ఒకరు వెల్లడించారు. ఆదివారం చేపట్టిన సహాయక చర్యల్లో నలుగురు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సోమవారం వర్షం కురవకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో గుహ దగ్గర సహాయక చర్యలను పునురుద్ధరించారు. వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటే మిగతా వారిని కూడా వీలైనంత త్వరగా బయటకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు.ఇంకా గుహలో ఏడుగురు చిన్నారులు, ఫుట్‌బాల్‌ కోచ్‌ ఉన్నారు. వాతావరణ పరిస్థితులు సక్రమంగా ఉండటం వల్ల సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. గుహ నుంచి బయటకు తీసుకొచ్చిన చిన్నారులు ఇప్పటి వరకు వారి తల్లిదండ్రులను కలవలేదు. ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉన్నందున చిన్నారులను కలిసేందుకు తల్లిదండ్రులకు అనుమతి ఇవ్వలేదని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న నరోంగ్‌సక్‌ వెల్లడించారు. ఆదివారం గుహ నుంచి నలుగురు చిన్నారులను బయటకు తీసుకొచ్చేందుకు సహకరించిన బృందంలోనే కొన్ని మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. చిన్నారులను బయటకు తీసుకొచ్చేందుకు మొత్తం 90 మంది డైవింగ్‌ నిపుణులు శ్రమిస్తున్నవారు. వారిలో థాయ్‌కు చెందిన వారు 40 మంది ఉండగా.. 50 మంది అంతర్జాతీయ డైవర్లు ఉన్నారు.

మరికొన్ని గంటల్లో ఇంకొంతమంది చిన్నారులను బయటకు తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. బయటకు తీసుకొచ్చిన నలుగురు చిన్నారులు బాగా ఆకలితో ఉన్నారని, కానీ వారి ఆరోగ్యం మాత్రం బాగానే ఉందని థాయ్‌ అధికారులు వెల్లడించారు. అయితే.. బయటకు తీసుకొచ్చిన చిన్నారుల పేర్లను ఇప్పటి వరకు బయటకు పెట్టలేదు. ధైర్యంగా ఉన్న చిన్నారులను తొలుత గుహ నుంచి బయటకు

తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. జూన్‌ 23న ఈ గుహలో 12 మంది చిన్నారులు, ఫుట్‌బాల్‌ కోచ్‌ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిలో నలుగురు చిన్నారులను ఆదివారం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగతా వారిని బయటకు తీసుకొచ్చేందుకు మరో రెండు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా కొద్ది గంటల పాటు సహాయక చర్యలను నిలిపివేశారు.