దండుమల్కాపురం పార్క్‌తో 20వేల మందికి ఉపాధి

త్వరలోనే మంత్రి కెటిఆర్‌ చేతులవిూదుగా శంకుస్థాపన: ఎమ్మెల్యే

భువనగిరి,జూలై20(జ‌నం సాక్షి): హైద్రాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న దండుమల్కాపురంలో కాలుష్య రహిత కంపనీలను ఏర్పాటు చేయిస్తున్నామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. త్వరలో ఐటీశాఖ మంత్రి కల్వకంట్ల తారకరామారావు చేతుల విూదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పార్క్‌ పనులు పూర్తయ్యాక లాంఛనంగా సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. 1200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ఇండస్టియ్రల్‌ పార్క్‌లో 20వేల మందికి ప్రత్యక్షంగా , పరోక్షంగా మరో 20వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 80శాతం మంది స్థానికులకే పార్క్‌లో ఉద్యోగాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 450మంది పరిశ్రమల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. దండుమల్కాపురం గ్రామంలో 1239 ఎకరాల్లో అతిపెద్ద పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం రూ. 123 కోట్లతో ఏర్పాటుచేయబోతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దండుమల్కాపురంను డంపింగ్‌ యార్డుగా మార్చేందుకు సన్నాహాలు చేశారని తెలిపారు. హైదరాబాద్‌లోని చెత్తా, చెదారం, కబేళాలను ఇక్కడ డంప్‌ చేసేందుకు ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. తాను ఉద్యమసయంలోనే దీన్ని వ్యతిరేకించానన్నారు. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ డంపింగ్‌ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించేలా చూశానన్నారు.