దక్షిణ కొరియాతో కీలక భాగస్వామ్యం

11 ఒప్పందాలపై సంతకాలు

ఇరు దేశాల మధ్య సంబంధాలపై మూన్‌తో చర్చించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి ): మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి దక్షిణ కొరియా ఇస్తున్న మద్దతు మరువలేనిదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న సౌత్‌ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. ఆ తర్వాత ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి దక్షిణ కొరియా అండగా నిలిచిందని ప్రధాని మోడీ తెలిపారు. సౌత్‌ కొరియాకు చెందిన కంపెనీలు ఏర్పాటు చేసిన పరిశ్రమలతో భారత్‌లో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సౌత్‌ కొరియాతో భారత్‌ కు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రధాని మోడీ చెప్పారు. భారత్‌ యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ మాదిరిగానే కొరియా న్యూ సదరన్‌ స్ట్రాటజీ కార్యక్రమాన్ని తీసుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఈ రెండు పాలసీల అజెండా, లక్ష్యాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయన్నారు. భారత్‌ లో పర్యటించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు సౌత్‌ కొరియా అధ్యక్షుడు

మూన్‌ జే ఇన్‌. భారత్‌ తో తమకు 45 ఏళ్ల స్నేహబంధం ఉందని గుర్తుచేశారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక 2015 నుంచి రెండు దేశాలు పలు కీలక రంగాల్లో పరస్పర సహకారం అందించుకుంటున్నాయని తెలిపారు. అంతకుముందు ఇరు దేశాల ఉన్నత స్థాయి అధికారులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, సౌత్‌ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ సైతం పాల్గొన్నారు. పలు కీలక రంగాలకు సంబంధించి రెండు దేశాలు 11 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరువురు నేతల సమక్షంలో రెండు దేశాల అధికారులు ఒప్పందాలు మార్చుకున్నారు.