దమ్ముంటే ప్రాజెక్టుల ద్వారా నీళ్లివ్వండి

4
– కేసీఆర్‌కు జానా సవాల్‌

హైదరాబాద్‌,నవంబర్‌ 25 (జనంసాక్షి):

వచ్చే మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కింద నీరు అందిస్తామన్న మాటకు సిఎం కెసిఆర్‌ కట్టుబడి ఉంటే సవాల్‌ను స్వకీరించడానికి తాను సిద్దంగా ఉన్నానని సిఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టుల ద్వారా రెండో పంటకు నీళ్లిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు తాను ప్రచార సారథిగా పనిచేస్తానన్న సవాల్‌ కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, జానారెడ్డి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలని నిన్న కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. వరంగల్‌ లోక్‌ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తమ పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత వహిస్తామని జానారెడ్డి తెలిపారు.  సీఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…ముందు కెసిఆర్‌ తన వాగ్దానాన్ని నిలుపుకునేలా పనిచేయాలన్నారు. అప్పుడు తాను అన్న మాట ప్రకారం నిలుస్తానని అన్నారు. గగెలుపోటములు సహజమని అంటూ విజయంతో విర్రవీగకుండా ప్రజల్లో అసహనం రాకుండా చూసుకోవాలని అన్నారు. వరంగల్‌ ప్రజలు కాంగ్రెస్‌ ప్రచారాన్ని నమ్మలేదని అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు వెళతామని చెప్పారు. ఓటమి చెందినంత మాత్రాన కేడర్‌ ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని భరోసాయిచ్చారు. 2019 ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పొత్తులైనా ఉండొచ్చని జానారెడ్డి అన్నారు.  కాంగ్రెస్‌ ఓటమికి ప్రజలదే బాధ్యత అని జానారెడ్డి అన్నారు. తాము ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని జానారెడ్డి పేర్కొన్నారు. విపక్షాలకు అసహనం ఉంటే ప్రభుత్వానికి ఇబ్బంది లేదని, కాని ప్రజల్లో అసహనం రాకుండా కేసీఆర్‌ చూసుకోవాలని చురకలు వేశారు.  మూడేళ్లలో సాగునీరు ఇస్తే కేసీఆర్‌కు ప్రచార కార్యకర్తగా ఉంటానన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. రాజకీయాల్లో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చన్నారు. 2019 ఎన్నికల్లో పొత్తుల అంశం ఇప్పుడు అప్రస్థుతమన్నారు. ప్రజస్వామ్యానికి అంకురార్పణ చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని పేర్కొన్నారు. గెలుపునకు విర్రవీగటం, ఓటమికి కుంగిపోవటం కాంగ్రెస్‌ సిద్దాంతం కాదన్నారు. భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి కాంగ్రెస్‌ పార్టీ నాంది పలికిందన్నారు. ప్రజలు విశ్వసించేలా మరింత ముందుకెళ్తామన్నారు. ఉప ఎన్నికల్లో పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమికి కారణాలు విశ్లేషించుకొని ముందుకు సాగుతామన్నారు.