దయాకర్‌ ఎన్నికల ఖర్చు పార్టీదే

5

– అన్ని సర్వేలు అనుకూలం

– వరంగల్‌ బ్రహ్మాండమైన విజయం సాధిస్తాం

– కేజీ టూ పీజీ తప్ప ఎన్నికల హామీలన్నీ అమలు చేశాం

హైదరాబాద్‌ అక్టోబర్‌31(జనంసాక్షి):వరంగల్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ధి పసునూరి దయాకర్‌కు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ శనివారం బీ ఫామ్‌ అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ దయాకర్‌ డబ్బులేని వ్యక్తి అని, పార్టీయే అతని ఎన్నికల ఖర్చును భరిస్తుందని తెలిపారు.  తాను అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హావిూలన్నీ అమలు చేశామన్నారు.శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో వరంగల్‌ జిల్లా నేతలతో నిర్వహించిన సవిూక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచినీరు విద్యుత్తు, సంక్షేమం ,ఇళ్లు ఇలా అన్ని హావిూలను పూర్తి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇకపై  తెలంగాణలో కరెంట్‌ కోతలుండవని, వచ్చే ఏడాది నుంచి కాలేజ్‌ హాస్టళ్లలో కూడా సన్నబియ్యంతో భోజనం ఉంటుదన్నారు. వచ్చే ఏడాది నుంచి బీపీఎల్‌ ఫ్యామిలీలందరికీ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. 60 వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హావిూలను తక్కువ సమయంలో నెరవేర్చామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. నూటికి 99 శాతం హావిూలను తక్కువ కాలంలో నెరవేర్చామని అన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు కాకుండా ఇతరత్రా కూడా అనేకకార్యక్రమాలు చేపట్టిన ఘనత మనదేనని కెసిఆర్‌ అన్నారు. ఒక్క కెజి టు పిజి తప్ప మిగిలినవాటిని అమలు చేశామని అన్నారు. బీహారులో నితీష్‌ కుమార్‌, ఉత్తరప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి మన మంత్రిని పిలుచుకుని వాటర్‌ గ్రిడ్‌ గురించి తెలుసుకుంటున్నారని అన్నారు.సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ ఛానెల్‌ కూడా తెలంగాణను నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్లను అమలు చేస్తూ అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించామన్నారు. కుల, మత భేదం లేకుండా తెల్లరేషన్‌ కార్డు ఉన్న అందరికీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. 16 నెలల్లో చిత్తశుద్ధితో పేదలకు సంక్షేమ పథకాలను అందించామన్నారు. తెలంగాణకు అన్నంపెట్టే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు.టీఆర్‌ఎస్‌ తరపున వరంగల్‌ లోక్‌సభకు పోటీ చేస్తోన్న పసునూరి దయాకర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు.

దయాకర్‌ కు బిఫారమ్‌ అందచేత

దయాకర్‌ మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పనిచేశారని తెలిపారు. అందరి మద్ధతుతోనే దయాకర్‌ను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశామని పేర్కొన్నారు. పార్టీలో ముందు నుంచి ఉన్నవాళ్లకు అవకాశం ఇవ్వాలనే దయాకర్‌కు లోక్‌సభ సీటు ఇచ్చామన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి తప్పకుండా అవకాశాలు వస్తాయన్నారు. దయాకర్‌ అభ్యర్థిత్వాన్ని అందరు అంగీకరించారని, ఎవరూ నొచ్చుకోకుండా జిల్లా నేతలు అందరూ ఇక్కడకు వచ్చారని తెలిపారు. దయాకర్‌కు మద్దతు ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. అభ్యర్థి ఎవరైనా అందరం కలిసి పనిచేసి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న సర్వేల ప్రకారం వరంగల్‌లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నామని సిఎం  అన్నారు. తెలంగాణ తల్లి రూపశిల్పి పసునూరి దయాకర్‌ అని అన్నారు. ఎన్నో వందల విగ్రహాలను ఆయన అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కరెంట్‌ కష్టాలు చెప్పనలవి కాదని కానీ ఇప్పుడు కరెంట్‌ కొరత లేదని తెలిపారు. ఇకపై కరెంట్‌ కోతలు ఉండవని తెలిపారు. ఈ సందర్బంగా  వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల బరిలోకి దిగిన పసునూరి దయాకర్‌కు సీఎం  బీ ఫామ్‌, ఏ ఫామ్‌ అందజేశారు.  దయాకర్‌ గెలుపుకు అందరం కలిసి కృషి చేద్దామని సీఎం కోరారు. దయాకర్‌ డబ్బులున్న వాడు కాదని, పేదవాడు అనకుండా ఆయన గెలుపు కోసం అందరం కలిసి పనిచేద్దామన్నారు. డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో దయాకర్‌ లేరని, ఆయనకు పార్టీయే ఫండ్‌ ఇస్తుందని, ఆ డబ్బుతోనే దయాకర్‌ గెలుస్తారని తెలిపారు. వీలుంటే ఇప్పుడే పార్టీ తరపున చెక్కు ఇచ్చి పంపిస్తామన్నారు. తాజా సర్వే ప్రకారం అద్బుతమైన గెలుపు సాధించబోతున్నామని అన్నారు. అంతా కలిసి అత్యధిక మెజార్టీ తీసుకు రావాలని అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి కాలేజీ హాస్టళ్ల విద్యార్ధులకు కూడా సన్న బియ్యం ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. సన్నబియ్యం పదకాన్ని టిఆర్‌ఎస్‌ మానిఫెస్టోలో పెట్టలేదని, అయినా అమలు చేశామని అన్నారు. బిపిఎల్‌ పేదలందరికి కులంతో నిమిత్తం లేకుండా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.డ అరవై వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఈ ఏడాది నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది మరిన్ని ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. మంచి ఉద్దేశంతో ఈ స్కీమ్‌ ఆరంభించామని ఆయన చెప్పారు. ముప్పై ఎనిమిది లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్‌ ఇస్తున్నామని అన్నారు. అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇవి గత ప్రభుత్వాల హయాంలో కనీసం ఆలోచన చేయలేదని ఆయన అన్నారు. మార్కెట్‌ కమిటీలలో రిజర్వేషన్లు అమలు చేయడంతో ఎస్‌.సి,బిసిలకు కూడా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లు అయ్యే అవకాశం వచ్చిందని అన్నారు.

వచ్చే ఎన్నికలకు తండాలన్నీ పంచాయితీలు

వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి తండాలన్ని పంచాయతీలు అవుతాయని అన్నారు. రంజాన్‌ పండగను ఘనంగా జరిపామని, వెయ్యి మందికి బట్టలు ఇచ్చామని,బతకమ్మ,బోనాలు పండగలను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించామని కెసిఆర్‌ అన్నారు. ఇరవైఐదు వేల మెగావాట్ల విద్యుత్‌ ను ఉత్పత్తి చేస్తామని, రెండు,రెండున్నర ఏళ్లలో వాటర్‌ గ్రిడ్‌ సిద్దం అవుతుందని ఆయన అన్నారు.ఇంత తక్కువ సమయంలో ఎన్నికల మానిఫెస్టోలోనివే కాకుండా,అదనంగా కూడా అమలు చేస్తున్నామని అన్నారు. వచ్చే యేడాది నుంచి పెళ్లీడుకొచ్చిన బీసీ యువతులకు కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందజేస్తామని హావిూ ఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ యేడాది 60 వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను కట్టిస్తామని తెలిపామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పారు. గతంలో ఏదో ఎన్నికల కోసం ఇండ్ల నిర్మాణం చేపట్టే వారని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అలా చేయబోదని స్పష్టం చేశారు. తక్కువ ఇండ్లు కట్టినా పేదలకు న్యాయం జరిగేలా ఇళ్ల నిర్మాణం ఉంటుందని వివరించారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి తండాలన్ని గ్రామ పంచాయతీలు అవుతాయని పేర్కొన్నారు.

వాటర్‌గ్రిడ్‌ అద్భుత పథకం

45 వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని చేపట్టామని రెండున్నరేళ్లలో ప్రతీ ఇంటికి మంచినీటిని అందిస్తామని తెలిపారు. మన వాటర్‌ గ్రిడ్‌ పథకం లాగానే తాను ఎన్నికల్లో గెలిస్తే బీహార్‌లో కూడా అలాంటి పథకం తీసుకు వస్తానని బీహార్‌ ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం నితీష్‌ కుమార్‌ ఇస్తోన్న హావిూని గుర్తు చేశారు. యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ కూడా మన మంత్రిని పిలిపించుకుని వాటర్‌ గ్రిడ్‌పై ఆరా తీశారని తెలిపారు. అధికారులు మనకు సరిపోయినంత మంది లేకున్నా ఇవన్నీ సాధించగలిగామని వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ముఖ్యమంత్రి కెసిఆర్‌ విమర్శించారు.దేవాదుల ప్రాజెక్టు కు ఏడువేల కోట్ల ఖర్చు తర్వాత నిర్దిష్ట పరిమాణంలో నీరు రావడం లేదని,అక్కడ బ్యారేజీ లేకపోవడమే కారణమని అన్నారు. అన్ని ప్రాజెక్టులు సద్వినియోగం అయ్యేలా రీడిజైన్‌ చేస్తున్నామని అన్నారు. వరంగల్‌ జిల్లా నంబర్‌ ఒన్‌ గా తయారు అవుతుందని ఆయన అన్నారు . మిడ్‌ మానేరు ప్రాజెక్టు పూర్తి అయితే వరంగల్‌ కు నీటి కష్టాలు తీరతాయని ఆయన అన్నారు.మన

ప్రతిభను అంతా గుర్తిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఎంపి కెకె, డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రి రాజయ్య, ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌,ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, ఎంపి వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.