దశల వారీగా 15ఏళ్ల నాటి వాహనాలన్నింటికీ ఇక స్వస్తి!

న్యూఢిల్లీ : 15 ఏళ్లకు పైబడిన వాహనాలన్నింటినీ దశల వారీగా తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ పాలసీని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ పాలసీతో రోడ్లపై చక్కర్లు కొడుతున్న 15ఏళ్ల నాటి 11.5 లక్షల ట్రక్కులు, బస్సులు ఇక కనుమరుగుకానున్నాయి. వాటి స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు ఆర్థిక ప్రోత్సహకాలు అందించాలని నిర్ణయించింది. దీంతో రూ.4000 కోట్లను వ్యయాన్ని ప్రభుత్వం భరించనుంది. కాలుష్యభరితమైన పాత వాహనాల తొలగింపుపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా మంత్రి నితిన్ గడ్కారీ బుధవారం చర్చలు జరిపారు. ఈ చర్చా నేపథ్యంలో పాత వాహనాల తొలగింపుకు ప్రత్యేక పాలసీని రూపొందించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

మొదటి దశలో పాత ట్రక్కులు, భారీ వాహనాలకు, రెండో దశలో 15ఏళ్ల కిందటి 60 లక్షల నాలుగు చక్రాల వాహనాలకు స్వస్తి పలుకనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.  ప్రీ-భారత్ స్టేజ్ వాహనాలకు వాలంటరీగా కాక తప్పనిసరిగా స్వస్తి పలకాలనే నిబంధనను తీసుకురావాలని ఆర్థిక మంత్రి భావిస్తున్నట్టు నితిన్ గడ్కారీ తెలిపారు. మరోవైపు ప్రోత్సహకాలు అందించడంలో ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుకు జైట్లీ సానుకూలంగా లేరని వెల్లడించారు. కానీ నేరుగా నగదు ప్రోత్సహకాలు అందించేందుకు బడ్జెట్లో ప్రొవిజన్ రూపొందించనున్నట్టు తెలిపారు.

ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు లేకపోవడంతో కొత్త వాహనాల విక్రయంతో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ కింద సుమారు రూ.18వేల కోట్ల నుంచి రూ.19వేల కోట్ల వరకు రెవెన్యూలను ఆర్జించనుంది. ఈ రెవెన్యూలు ప్రభుత్వం అందించే ప్రోత్సహకాల కంటే అధికమే. అదేవిధంగా పాత వాహనాల రీప్లేస్మెంట్తో క్రూడ్ ఆయిల్ దిగుమతులు కూడా రవాణాశాఖ తగ్గించుకుని, వార్షికంగా రూ.7,700 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకోనుంది. పాత వాహనాలతో ముంచుకొస్తున్న కాలుష్య ముప్పుతో పాటు, రెవెన్యూలు ఆర్జించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.