దహెగామ్‌ సహాయక చర్యల్లో విషాదం

వరదలో కొట్టుకు పోయిన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతి

ఆసిఫాబాద్‌,జూలై14(జనం సాక్షి): కొమురం భీం జిల్లా దహేగాంలో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు. మృతులను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన రాము, సతీశ్‌గా గుర్తించారు. శ్రీరామ్‌పూర్‌ ఏరియా సింగరేణి రెస్క్యూ టీమ్‌లో పనిచేస్తున్న వీరు వరద సహాయక చర్యల కోసం దహేగాం ప్రాంతానికి వచ్చి
వరద ప్రవాహాంలో గల్లంతయ్యి మృతి చెందారు. రాము, సతీష్‌ మరణించారనే వార్తతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మండలంలోని పెసర కుంట పెద్ద వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తుండటంతో సహాయ చర్యల కోసం సింగరేణి సంస్థ రెస్క్యూ టీమ్‌ను పంపించింది. అక్కడ ఇద్దరు కార్మికులు ఓ గర్భిణీని వాగు దాటించే క్రమంలో ప్రమాదవశాత్తు జారి నిన్న గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం గల్లంతైన వారి మృతదేహాలను కనుగొన్నారు. మృతులు సతీష్‌, రాము మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.