దానం దాదాగిరి తెలంగాణవాదులపై దాడి
హైదరాబాద్, జనవరి 17(జనంసాక్షి) :
రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ మరోసారి దాదాగిరి ప్రదర్శించాడు. తెలంగాణపై ఆయన ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణవాదులపై దాడులకు తెగబడ్డాడు. ఈక్రమంలో రెచ్చిపోయిన విద్యార్థులు ఆయన కాన్వాయ్‌పై దాడికి దిగారు. గురువారం మంత్రుల క్వార్టర్స్‌లో జరుగుతున్న సమైక్యాంధ్ర సమావేశాన్ని అడ్డుకొనేందుకు తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో క్వార్టర్స్‌కు తరలివచ్చారు. అప్పుడు అటుగా వస్తున్న దానం వాహనాన్ని చుట్టుముట్టి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలంటూ తెలంగాణకు అడ్డు పడొద్దని డిమాండ్ చేశారు. దీంతో రెచ్చిపోయిన దానం పోలీసుల సాయంతో ఆందోళనకారులపై దాడికి తెగబడ్డాడు. ఆందోళనకారులు పరుగులు పెట్టగా ఆయన అనుచరులు వెంబడించి ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మంత్రి అనుచరులు తెలంగాణ వాదులపై దాడికి దిగారు. మరోవైపు, పోలీసులు కూడా నిరసనకారులపై లాఠీచార్జి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్వతంత్ర భారతదేశంలో ఎవరి అభిప్రాయాలు చెప్పుకొనే హక్కు వారికి లేదా అంటూ తర్వాత దానం సన్నాయి నొక్కులు నొక్కారు. ఇదిలా ఉంటే, మంత్రి దానం నాగేందర్‌పై ఓయూ విద్యార్థులు, న్యాయవాదులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై అకారణంగా మంత్రి దానం, ఆయన అనురులు దాడి చేశారని ఫిర్యాదు పేర్కొన్నారు. దానంపై కేసు నమోదు చేయాలని కోరారు. అదే సమయంలో ఓ న్యాయవాదిపై దానం అనుచరులు మళ్లీ దాడికి తెగబడ్డారు.