దానా మాఝికి ప్రపంచం నలుమూలల నుంచి అండ

3భువనేశ్వర్‌:
ఎదుటివారి కష్టాలు విన్నా, కన్నా కన్నీళ్లే వస్తాయి.. తమకు తోచిన రీతిలో పలువురు స్పందిస్తారు. ఒక్కరైతే కొంచెం.. అదే పది చేతులు కలిస్తే కష్టాలు తీరిపోయినట్లే.. భార్య మృతదేహాన్ని మోసుకువెళ్లిన కలహండి జిల్లా థువామల్‌ రామ్‌పూర్‌ సమితి మెల్‌ఘర్‌ గ్రామానికి చెందిన  దానా మాఝికి ప్రపంచం నలుమూలల నుంచి అండగా నిలబడ్డారు.. వారిలో బెహ్రాన్ ప్రధాని కూడా ఉన్నారు.దానామాఝి భార్య దీర్ఘ కాలం క్షయ రోగంతో బాధపడి దుర్బర జీవితం గడిపింది. అమంగ దెయి భవానిపట్న ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుది శ్వాస విడిచింది. భార్య మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు సహకరించాలన్న అతని ప్రార్థన ఆస్పత్రివర్గాలను కదిలించలేదు.దీంతో భార్య శవాన్ని భుజాన వేసుకుని 60 కిలో మీటర్ల దూరం వెళ్లేందుకు మైనరు కూతురు తోడుగా కాలి నడకన బయల్దేరాడు. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో పలువురు స్పందించారు. అతని దయనీయ స్థితికి జాలిపడ్డారు. మానవీయత ప్రతిబింబిస్తే మనుషుల కష్టాలు ఇట్టే తీరిపోతాయనేందుకు ఇదో నిలువెత్తు తార్కాణంగా పేర్కొనవచ్చు. దానా మాఝి కష్టాలపట్ల ప్రపంచ దేశాల నుంచి దయార్ద్ర హృదయులు సానుభూతితో స్పందిస్తున్నారు. ఈ జాబితాలో బెహ్రాన్ ప్రధాన మంత్రి ఒకరు కావడం విశేషం.

ముగ్గురు కుమార్తెలకు ఉచిత విద్య
దానా మాఝి ముగ్గురు కుమార్తెలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యనందిస్తుందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. తల దాచుకునేందుకు స్వగ్రామంలో ఇందిరా ఆవాస్‌ యోజన కింద పక్కా ఇల్లు నిర్మించేందుకు రూ. 75 వేల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసింది. 4 డెసిమల్స్‌ విస్తీర్ణంలో పక్కా ఇల్లు నిర్మిస్తారు. రెడ్‌క్రాస్‌ సంస్థ 30 వేల నగదు సహాయం అందజేసింది. జాతీయ కుటుంబ సంక్షేమ పథకం కింద రూ. 52,000 ఆర్థిక సహాయంతో బియ్యం కోటా మంజూరైంది. సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ 5 ఏళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షలతో ఫిక్స్‌డ్‌ డిపాజిటు ఖాతా తెరిచింది.

కాల పరిమితి పూర్తి అయ్యే నాటికి ఈ మొత్తం రూ. 7.34 లక్షలు అవుతుంది. దానా మాఝి పెద్ద కుమార్తె చాందిని మాఝికి ఉద్యోగం ఇవ్వడం లేదా వివాహమయ్యే వరకు ప్రతి నెలా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన స్వచ్చంధ సంస్థ రూ. 80 వేల ఆర్థిక సహాయం అందజేస్తు దానా మాఝితో ఆయన ముగ్గురు కుమార్తెల పేర్ల మీద రూ. 10 వేల చొప్పున వేర్వేరుగా 4 చెకుల్ని ప్రదానం చేసింది. గుజరాతు నుంచి ఇద్దరు వ్యాపారులు రూ. 2 లక్షల చెక్కుల్ని పంపారు. అమెరికాలో ఉంటున్న ఒడియా వ్యక్తి జితేంద్ర మిశ్రా రూ. 1.05 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. రూ. 20 వేల ఆరంభ ఖాతాతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దానా మాఝి పేరు మీద పొదుపు ఖాతా తెరిచింది. బెహ్రాన్ ప్రధాన మంత్రి అందజేసిన ఆర్థిక సహాయం వివరాలు తెలియాల్సి ఉంది.