దాన్యం డబ్బులకు తిప్పలు….

ఖాతాల్లో సకాలంలో డబ్బులు పడక అవస్థలు పడుతున్న రైతులు,
*పట్టించుకోని అధికారులు,
ఖానాపురం జూన్ 28(జనం సాక్షి )
మండలంలోని సొసైటీ, ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన వరిధాన్యానికి సకాలంలో డబ్బులు రాకపోవడంతో రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ధాన్యాన్ని విక్రయించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని మిల్లులకు తరలించి నప్పటికీ.ధాన్యానికి రావాల్సిన డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో తాము ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని తెచ్చిన వాటికి వడ్డీలు పెరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొందరు రైతులు ప్రతి రోజు బ్యాంకు చుట్టూ దాన్యం డబ్బులు పడ్డాయా పడలేదని కాళ్లు అరిగేలా తిరుగుతున్న కూడా బ్యాంకుల దగ్గర వెళ్లి సంప్రదిస్తే బ్యాంకు వారు దాన్యం డబ్బులు జమ కాలేదు అని చెప్పడంతో రైతులు నిరాశతో సంబంధిత అధికారులను సంప్రదిస్తే వారు మాకేమీ తెలియదని మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయని తెలుపుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాన్యం డబ్బులు వస్తాయని ఎదురు చూసిన రైతన్నలు   నెలరోజులైనా డబ్బులు జమ కాకపోవడంతో విత్తనాలకు ఎరువులకు వ్యవసాయ పెట్టుబడికి పిల్లల చదువులకు ప్రైవేట్ వ్యక్తులు ఆశ్రయించి అప్పులు చేయకతప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రైతులకు ధాన్యం డబ్బులు త్వరగా జమ చేసిఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.