దావూద్‌తో ముంబై పోలీసులకు సంబంధం
– చోటారాజన్ సంచలన వ్యాఖ్యలు
ముంబై,నవంబర్ 3(జనంసాక్షి):
ముంబై చీకటి సామ్రాజ్యపు నేత ఛోటారాజన్ నోరువిప్పడమే గాకుండా సంచలన వ్యాఖ్యలుచేశాడు. ముంబయి పోలీసుల్లో కొందరికి మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని ఆరోపించాడు. దావూద్ ఇబ్రహీంకి తాను భయపడనని.. ఉగ్రవాదం, దావూద్‌కు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడతానని స్పష్టం చేశాడు. తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులేనని ఆరోపించాడు. ఎన్నో ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న ఛోటారాజన్ రెండు వారాల క్రితం ఇండోనేషియాలోని బాలీలో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. చోటారాజన్‌ను భారత్ తీసుకొచ్చేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న దశలో అతను దొరికిపోయాడు. ఈ దశలో . ఇప్పటికే ఛోటా రాజన్‌ను సీబీఐ, దిల్లీ, ముంబయి పోలీసులు ప్రశ్నించారు. రేపో మాపో చోటా రాజన్‌ను భారత్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. రాజన్‌పై ముంబయిలో 75, దిల్లీలో 10 కేసులు నమోదయ్యాయి. అయితే ముంబై పోలీసులపై తనకు నమ్మకంలేదని, వారు తనకు చాలా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై పోలీసుల్లో కొందరికి మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే తనను ఢిల్లీ పోలీసులకు అప్పగించాలని కోరారు. దావూద్ అంటే తనకు భయంలేదని, తాను ఎవరికీ భయపడబోనని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా దావూద్ ఇబ్రహీం, ఐఎస్‌ఐకి వ్యతిరేకంగా పోరాడుతోన్న తనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నానని తెలిపారు. కాగా, రాజన్‌ను ముంబై పోలీసులకు గానీ, ఢిల్లీ పోలీసులకు గాని అప్పగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.