దావూద్ లొంగిపోతానన్నాడు
– సీబీఐ మాజీ డైరెక్టర్ నీరజ్ కుమార్
– అలాంటి సమాచారం లేదు : విజయరామారావు
హైదరాబాద్,మే 2 (జనంసాక్షి):
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్. 1993 పేలుళ్ల తర్వాత దావూద్ లొంగిపోయేందుకు సిద్ధపడ్డాడని.. అయితే, అతను పెట్టిన షరతులకు సీబీఐ అంగీకరించలేదన్నారు. తాను సీబీఐ డీఐజీగా ఉన్న సమయంలో దావూద్ తో ఫోన్ లో మూడుసార్లు మాట్లాడినట్లు నీరజ్ కుమార్ చెప్పారు. భారత్ కు వస్తే ప్రత్యర్ధుల నుంచి ప్రాణహాని ఉందని, ముంబై పోలీసులు తనను టార్చర్ పెడతారని దావూద్ తనతో చెప్పాడన్నారు. 2013లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా రిటైర్ అయిన నీరజ్ కుమార్ తన అనుభవాలను పుస్తకంలో రాయనున్నారు. అయితే, నీరజ్ కుమార్ వ్యాఖ్యలను సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు తోసిపుచ్చారు. అలాంటి విషయమేదీ తన దృష్టికి రాలేదన్నారు. దావూద్ లొంగుబాటు ప్రతిపాదన తనవద్దకు ఎప్పుడూ రాలేదని, ఏ అధికారీ తన వద్ద దావూద్ లొంగుబాటు ప్రతిపాదన తేలేదని విజయ రామారావు అన్నారు. ఆ సమయంలో దావూద్ దుబాయ్‌లో తలదాచుకున్నారని, ఆయనను పట్టించేందుకు దుబాయ్ ప్రభుత్వం సహకరించలేదని ఆయన అన్నారు. భద్రతా సంస్థలన్నీ ఆయనను పట్టుకునేందుకు చాలా కష్టపడ్డాయన్నారు. నీరజ్ వ్యాఖ్యలు భద్రతా సంస్థలపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయని, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కొన్నిసార్లు లొంగుబాటు ప్రచారం చేస్తారని విజయ రామారావు పేర్కొన్నారు. లొంగిపోతే వద్దని అంటారా అని అన్నారు. అయితే సిబిఐ డైరెక్టర్ గా ఆ సమయంలో కె.విజయరామారావు ఉన్నారు. అనూహ్యంగా దావూద్ ఇబ్రహిం వివాదంలో ఇరుక్కున్నారు. ఉగ్రవాది దావూద్ ఇబ్రహిం గతంలో లొంగిపోతానని ప్రతిపాదించారని , అప్పట్లో సిబిఐ ఛీఫ్ గా ఉన్న విజయరామారావు అందుకు ఒప్పుకోలేదని ఢిల్లీ నగర పోలీస్ మాజీ కమిషనర్ నీరజ్ కుమార్ వ్యాఖ్యానించారు.ఇది సంచలనంగా మారింది.తనకు మూడు సార్లు ఈ విషయమై దావూద్ ఫోన్ చేశారని నీరజ్ అంటున్నారు.ఈ వాదనను విజయవరామారావు ఖండించారు.దావూద్ లొంగుబాటుకు సంబందించి తనకు ఎలాంటి సమాచారం కాని,ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు.దావూద్ కోసం అనేక దేశాలలో గాలించామని, అతను లొంగిపోతామంటే వదలి పెడతామా అని ఆయన ప్రశ్నించారు.