దిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయండి
– సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ నవంబర్ 07 (జనంసాక్షి): డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని తెలిపారు.
డిండి ఎత్తిపోతల పథకంపై ఆయన సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ..
రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల, కృష్ణరాంపల్లి, శివన్న గూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలోని అర్కపల్లిలో రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రారంభించాలని తెలిపారు. ఇందు కోసం కేటాయించిన రూ.75 కోట్లకు అదనంగా తక్షణమే మరో రూ.100 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు.
భూ నిర్వాసితులకు భూమి విలువ, ఆస్తి విలువతోపాటు కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి రూ.5.4 లక్షలు ఒకేసారి చెల్లించాలని పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ అధికారులే ఆస్తుల విలువను అంచనా వేసి రెవెన్యూ అధికారులకు అందించాలని సూచించారు. వీలైనంత తక్కువ ముంపుతో ఎక్కువ గ్రామాలు మనిగిపోకుండా రిజర్వాయర్లు నిర్మించాలని తెలిపారు. ఏ రిజర్వాయర్‌కు ఎంత భూమి సేకరించాలో నిర్ణయించి అంచనాలు రూపొందించుకోవాలని అన్నారు. రైతులకు అనుకూల పరిహారం ఇస్తున్నందున భూసేకరణ వేగంగా జరగాలని అన్నారు. పరిహారం అంతా ఒకేసారి చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించడంతోపాటు హైదరాబాద్ నగరానికి మంచినీటిని అందించేలా ప్రాజెక్టులను డిజైన్ చేయాలని సూచించారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సురక్షిత మంచినీటిని అందించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నల్లగొండ జిల్లాలో నిర్మించే గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల కోసం భూసేకరణ జరపాలన్నారు.