దిమాపూర్ లో కొనసాగుతున్న కర్ఫ్యూ

888555నాగాలాండ్ రాష్ర్టంలోని దిమాపూర్ లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. రేప్ కేసు నిందితుడి దారుణహత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా… నాగాలాండ్ ప్రభుత్వం వరుసగా రెండో రోజు కర్ఫ్యూ కొనసాగిస్తోంది. భారీగా పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించింది. దీంతో దిమాపూర్ పట్టణంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
జైల్లో ఉన్న ఖైదీని బయటికి ఈడ్చుకెళ్లి హత్య చేస్తున్నా అడ్డుకోలేకపోయిన జైలు సూపరింటెండెంట్ తోపాటు… దిమాపూర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను నాగాలాండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా దిమాపూర్ లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని… గత కొన్ని గంటలుగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సైతం దిమాపూర్ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని నాగాలాండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాగాలాండ్ లో హత్యకు గురైన వ్యక్తి అసోంకు చెందిన వాడు కావడంతో… సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సరిహద్దుల్లో రాకపోకలను స్తంభింపజేశాయి. అటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగాలాండ్ సర్కారు ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది.
ఈ ఘటనను అసోం ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఒక వ్యక్తిపై వందల మంది మూకుమ్మడి దాడిచేసి హతమార్చడం ఆటవిక చర్య అని అసోం సీఎం తరుణ్ గొగోయ్ మండిపడ్డారు. యువకుడు నేరం చేసినట్లు రుజువైతే చట్టమే శిక్షించేదని… కానీ, కొంతమంది వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దారుణమన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గొగోయ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
దిమాపూర్ లో కార్ల డీలర్ గా వ్యాపారం చేస్తున్న సయ్యద్ షర్ఫుద్దీన్ ఖాన్… 20 ఏళ్ల నాగా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… కోర్టు ఆదేశాల మేరకు నిందితున్ని రిమాండ్ కు తరలించారు. ఐతే, గురువారం దాదాపు రెండు వేల మంది మూకుమ్మడిగా జైల్లోకి చొరబడి… నిందితున్ని బయటకు లాక్కొచ్చారు. నగ్నంగా ఊరేగిస్తూ దిమాపూర్ లోని క్లాక్ టవర్ చౌరస్తాకు తీసుకెళ్లారు. క్లాక్ టవర్ చుట్టూ ఉన్న గ్రిల్స్ కు కట్టేసి… రాళ్లు, చెప్పులతో కొట్టి చంపారు. చివరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో శవాన్ని వదిలి పారిపోయారు.