దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దివ్యాంగులకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని,దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా మహిళా , శిశు, దివ్యాంగుల, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జివివి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి ఏమి కావాలని ఆలోచించి,వారి కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు.గతంలో రూ.750 ఉన్న దివ్యాంగుల పెన్షన్ ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రూ.3016 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు.సకలాంగులతో సమానంగా దివ్యాంగులు అన్నింటిలో ముందుండాలని వారికి దివ్యాంగ ఉపకరణాలు, సబ్సిడీ రుణాలు, వివాహ పారితోషకాలు, మెరిట్ స్కాలర్షిప్ లు  అందజేసి వారి సంక్షేమం కొరకు నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో  దివ్యాంగుల ఆశీర్వాదం ఉండాలని కోరారు.జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కొరకు అన్ని వసతులతో కూడిన భవనాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించి, క్షేత్రస్థాయిలో దివ్యాంగుల సంక్షేమ పథకాలు చేరే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు.సకలాంగులకు ధీటుగా దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు.అనంతరం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో రాణించిన సూర్యాపేట దివ్యాంగ క్రీడాకారులను సన్మానించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ట్రై సైకిల్, వీల్ చైర్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపిక యుగేందర్ రావు , ఎలిమినేటి సందీప్ రెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాల్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , సూర్యాపేట జడ్పిటిసి జీడి బిక్షం , ఎంపీపీ రవీందర్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్లు , జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ, జిల్లా వైద్యాధికారి కోటాచలం, మెప్మా పీడీ రమేష్ నాయక్, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు నహీం , రాజేష్, జహీర్ బాబా, సతీష్, చిలక నాగేశ్వరావు, సైదులు, శ్రీనివాస్, రవీందర్,  వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు