దీక్షలతో కేంద్రాన్ని ఎండగట్టాలి

విభజన ద్రోహాలను ప్రజలకు వివరించాలి

టెలి కాన్ఫరెన్స్‌లో బాబు సూచన

అమరావతి,జూన్‌4(జ‌నం సాక్షి): రెట్టించిన ఉత్సాహంతో నవనిర్మాణ దీక్షలు విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అదే సందర్భంలో విభజనతో ఎపికి జరిగిన నష్టాన్ని కేంద్రం చేసిన ద్రోహాన్ని ఎండగట్టాలని అన్నారు. సోమవారం నవ నిర్మాణ దీక్ష నిర్వహణపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి ఒక్కరిలోనూ నవనిర్మాణ స్ఫూర్తి ఉండాలన్నారు. గ్రామాలకు వెళ్లి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం పెంచే బాధ్యత సాధికారమిత్రలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీక్షలతో ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలన్నారు. ఇదిలావుంటేభూగర్భ జలాన్ని అతిపెద్ద జలాశయంగా మార్చుకోవాలని, జల సంరక్షణ చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో నీరు-ప్రగతి, వ్యవసాయంపై ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ… నీటి చేరిక ఎంత ముఖ్యమో, జలాశయాల నిర్వహణ అంతకన్నా ప్రధానమని అన్నారు. సీజన్‌లో సాగునీటి విడుదల తేదీలను ముందే ప్రకటించి, రైతుల్లో భరోసా పెంచాలని కోరారు. పంట కాలువలు, చెరువులను నీటి నిల్వకు సిద్ధం చేయాలి. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలి. రిజర్వాయర్లు, చెరువులకు గల 750 గేట్లను తనిఖీ చేసి, పకడ్బందీగా గేట్ల నిర్వహణ ఉండేలా శ్రద్ధ పెట్టాలి. మైక్రో ఇరిగేషన్‌ మరో 4 రెట్లు పెరగాలి అని అధికారులకు చంద్రబాబు సూచించారు.