దీక్ష విరమించిన పవన్
ఎచ్చెర్ల క్యాంపస్,జనం సాక్షి : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై తాను చేసిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష ముగిసింది. పవన్‌కు నిమ్మరసం ఇచ్చి ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం ఆయన దీక్షను విరమింపజేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. ఉద్దానం బాధితులకు అండగా నిలబడుతున్న వారే నిజమైన హీరోలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుకున్నట్టుగా రాజకీయ గుర్తింపు కోసం ఈ దీక్ష చేయలేదని అన్నారు. అన్యాయం పరాకాష్టకు చేరుకున్నప్పుడే ఇలాంటి ఉద్యమాలు వస్తాయన్నారు.తాను చేసిన 17 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఈ దీక్ష చేపట్టినట్టు పేర్కొన్నారు. రూ.2వేల కోట్లకు పైగా పుష్కరాలకు ఖర్చు చేశారని, ఉద్దానంలో ఆ మాత్రం ఖర్చు చేయలేరా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును తాను తప్పుబడుతున్నాని, త్రికరణ శుద్ధిగా ఉంటే నమ్ముతాను కానీ, వెన్నుపోటు పొడిస్తే కాదని చెప్పారు. నిన్న(శుక్రవారం) సాయంత్రం 5 గంటల నుంచి చేపట్టిన ఈ దీక్ష, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగింది.