దుబ్బాకలో గెలుపుతో మార్పుకు శ్రీకారం

బిజెపి దూకుడుతో మంత్రికి ముచ్చెమటలు: రఘునందన్‌ రావు
సిద్దిపేట,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దుబ్బాక ప్రచారంలో బిజెపి ముందున్నదని, గెలుపు దిశగా తమ ప్రచారం సాగుతున్నదని బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఈ ఎన్నిక దుబ్బాక ప్రజల ఆత్మాభిమాన పోరాటమని తెలిపారు. తమ ప్రచారంతో అధికార టిఆర్‌ఎస్‌లో కలవరం మొదలయ్యిందని అన్నారు. మంత్రి హరీష్‌ రావుకు ముచ్చెమటలు పట్టి దుబ్బాకలోనే మకాం వేశారని అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు మూలంగా దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా అన్యాయానికి గురైందని విమర్శించారు.  గ్రామగ్రామాన బీజేపీకి ప్రజాధరణ పెరుగుతున్నదని గ్రహించిన అధికార పార్టీ తప్పుడు కేసులు, వేధింపులతో బెదిరించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒక్క కార్యకర్తకు నష్టం జరిగినా ప్రాణాలను అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటానని స్పష్టం చేశారు. దుబ్బాక ఎన్నికలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నింటినీ ప్రజలు గ్రహిస్తున్నారని, టీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. మంత్రి హరీశ్‌రావు అనుచరగణం ఇక్కడి నాయకత్వాన్ని అజమాయిషీ చేస్తున్నారని, చీమునెత్తురు ఉన్న దుబ్బాక నాయకత్వం వారిపై తిరగబడాలని పిలుపునిచ్చారు. ఎన్నాళ్లు సిద్దిపేట పెత్తనం విూద తలవంచి దుబ్బాక ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారని ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గానికి రావాల్సిన నిధులను సిద్దిపేట, గజ్వేల్‌లకు తరలించారని విమర్శించారు. దుబ్బాకలో శంకుస్థాపన చేసుకున్న పాలిటెక్నిక్‌ కళాశాలను సిద్దిపేటకు తరలించారని ధ్వజమెత్తారు. దుబ్బాక నాయకుడిని క్యాంపు కార్యాలయానికి పరిమితం చేసి, ఉన్న నిధులను అప్పనంగా తీసుకెళుతున్న దొంగలని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు నిజంగా దుబ్బాకలో చదివిన ప్రేమ ఉంటే కాల్వల్లో భూములు కోల్పోయిన రైతులకు కనీస పరిహారం ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. దుబ్బాక ప్రాంతం ప్రజలు ముంపు, కంపుతో తల్లడిల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికతో టీఆర్‌ఎస్‌కు చెంప చెల్లుమనిపించేలా తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ఓటమితోనే సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కలుగుతుందని తెలిపారు. దుబ్బాకలో గెలుపుతో రాజకీయాల్లో మార్పునకు శ్రీకారం చుట్టాలని ఆయన ప్రజలను కోరాఉ.