దూషణల వల్ల తెలంగాణ రాదు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి

సంగారెడ్డి, జనవరి 28 (): తెలంగాణ రాష్ట్ర విభజన తెలంగాణ రాష్ట్రసమితికి ఇష్టం లేదని స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ, ప్రజలకు ఉన్న మనోభావాలు, ఆకాంక్షను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకే గత 12 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్‌ ఉద్యమాలు నడిపిందని అన్నారు. రాజమండ్రిలో సమైక్యవాదులు  జై ఆంధ్రప్రదేశ్‌ సభను జరపడానికి కారణం కేసీఆరేనని అన్నారు. ఆ ప్రాంతం వారిని కేసీఆర్‌ వ్యక్తిగతంగా దూషించడంతో రెచ్చిపోయి సభను ఏర్పాటు చేశారని అన్నారు. వ్యక్తగత దూషణల వల్ల తెలంగాణ రాదని ఐక్యంగా పోరాడితేనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు రాజీనామాలు చేయాలని జేఏసీ డిమాండ్‌ చేయడం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోదని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు రాజీనామాలు ఇస్తే తిరిగి ఎన్నికలు వస్తాయే తప్ప ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోదని అన్నారు. టీఆర్‌ఎస్‌ రాజకీయంగా బలోపేతం అయ్యేందుకే  ఎజెండాగా ఉందని అన్నారు. రాజీనామాల వల్ల రాష్ట్ర విభజన ఎలా జరుగుతుందో జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ తెలపాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను తెలంగాణలో తిరగనివ్వబోమని, వారిని బహిష్కరించాలని కోదండరామ్‌ అనండం ఆయనకు హక్కు ఎక్కడ ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికై ప్రజల అభివృద్ధిని కోరుకునేది కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి 2014 ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపొందాలనుకోవడం తెలంగాణవాదుల్లో కనిపిస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీగా ఓట్ల రాజకీయం చేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌లపై విశ్వాసం సన్నగిల్లిందని ఎవరూ విశ్వసించడం లేదని జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు ఉన్న సీట్లకంటే మరో 50 సీట్లు అధికంగా గెలుచుకోవడం ఖాయమని ఆయన అన్నారు. తాను టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీ నుండి పోటీ చేసి గెలిచానని ఆయన గుర్తు చేశారు. ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సమరభేరిలో తనపై ప్రసంగించిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆయన రిజర్వేషన్‌ సీట్‌పై గెలిచాడని తాను కార్పొరేటర్‌ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదానని ఆయన గుర్తు ఉంచుకోవాలని  జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో గ్రంథాయల సంస్థ ఛైర్మన్‌, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అనంతకిషన్‌ తదితరులు  పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రిని జయప్రకాశ్‌రెడ్డి తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రి అభివృద్ధికి కోటీ రూపాయలు మంజూరు చేయిస్తానని అన్నారు. పేదల రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆయన డాక్టర్లకు సూచించారు.