దేవాలయాల అభివృద్ధి ప్రత్యేక దృష్టి

కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి మహర్దశ
దేవాలయ అభివృద్ధికి రూ.10కోట్లు నిధులు మంజూరుచేశాం
ఆలయంలో ప్లాస్టిక్‌ నిషేదానికి కమిటీ చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర మంత్రి హరీష్‌రావు
ఘనంగా కొమురవెల్లి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం
సిద్ధిపేట, జూన్‌15(జ‌నం సాక్షి ) : ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్‌ ప్రత్యేక దీష్టిసారించి నిధులు విడుదల చేశారని, దీనిలో భాగంగా కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి మహర్దశ వచ్చిందని నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఆలయంలోని పాలకమండలి కాన్ఫరెన్స్‌ హాల్‌ లో శుక్రవారం నిర్వహించిన పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి హరీశ్‌ రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్‌ రెడ్డి హాజరయ్యారు. వీరి సమక్షంలో దేవాలయ కమిటీ చైర్మన్‌ సంపత్‌, కమిటీ సభ్యులందరూ ప్రమాణస్వీకారం చేశారు. కమిటీ చైర్మన్‌ సంపత్‌ తోపాటు కమిటీ సభ్యులకు మంత్రి హరీశ్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. గొల్ల కుర్మల ఆరాధ్య దైవమైన కొముర వెళ్లి మల్లన్న స్వామి ఆలయానికి కమిటీ ఛైర్మన్‌ గా గొల్ల కుర్మలే ఉండాలన్న కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్‌ కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో మల్లన్న దేవాలయానికి మహర్దశ వచ్చిందన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రూ.10కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. భక్తులకు సేవ చేయడమంటే.. భగవంతునికి సేవ చేయడమే అని చెప్పిన మంత్రి.. ఆలయ అభివృద్ధికి అందరూ సమిష్టిగా ముందుకెళ్లాలన్నారు. అన్ని వసతులను సమకూర్చేలా.. సౌకర్యాల కల్పనకు కృషి చేయాలన్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్‌ను నిషేధం చేసేలా కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ విషయంలో ప్రత్యామ్నాయ కల్పనకు కృషి చేసేలా చొరవ చూపాలని పాలక మండలి, అధికారిక యంత్రాంగానికి మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రతీ బుధవారం ఆలయ అభివృద్ధి పై డీఆర్వో చంద్రశేఖర్‌, ఆలయ ఈఓ, పాలక మండలి సభ్యులతో సవిూక్ష జరపాలని మంత్రి సూచనలు చేశారు.