దేశంలోనే విప్లవాత్మక పథకాల్లో రైతుబంధు ఒకటి
– గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు
– కేసీఆర్ చలవతో వ్యవసాయం పండగాల మారింది
– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
– నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
– జూపల్లికి ఎడ్ల బండ్ల ర్యాలీతో స్వాగతం పలికిన స్థానికులు
నాగర్‌కర్నూల్, మే18(జనం సాక్షి ): దేశంలోనే విప్లవాత్మక పథకాల్లో రైతుబంధు ఒకటి, కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో దేశంమొత్తం తెలంగాణ వైపు చూస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో కొల్లాపూర్ మండలంలోని చింతలపల్లి, పాన్‌గల్ మండలంలోని శాగాపూర్ గ్రామాల్లో రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావుకు రైతులు ఎడ్ల బండ్ల ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కూడా ఎడ్ల బండెక్కి ఆ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. దేశంలోని విప్లవాత్మక పథకాల్లో రైతుబంధు పథకం ఒకటని జూపల్లి తెలిపారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. ఇలాంటి నేత తెలంగాణకు సీఎం కావడం మన అందరి అదృష్టమని జూపల్లి పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి నేటి వరకు జరిగిన రైతు బంధు కార్యక్రమంలో చిన్న అపశ్రుతి కూడా జరగలేదన్నారు. ఇది కేవలం రైతు కార్యక్రమంగా జరిగింది.. రాజకీయ వేదికలుగా దీనిని వాడుకోలేదని స్పష్టం చేశారు. రైతుబంధు అమలు జరుగుతున్న తీరు చూస్తుంటే ఇతర రాజకీయ పార్టీలకు భయం అవుతుందని అన్నారు. కానీ బయటకు విమర్శలు చేయలేని పరిస్థితి. ఇష్టం ఉన్నా, లేకపోయినా సహకరించాల్సి వస్తుందన్నారు. ఎడాది కాలంగా అధికారులు, సిబ్బంది కష్టపడి భూవివాదాలు లేకుండా రికార్డులు తయారు చేశారని ఈ సందర్భంగా అధికారులను జూపల్లి అభినందించారు. అందుకే ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఇందుకోసం కష్టపడిన ఉద్యోగులందరికి కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.