దేశంలో తీవ్ర నీటి సంక్షోభం

సుమారు 60కోట్ల మంది నీటి కొరత ఎదుర్కొంటున్నారు

2020 కల్లా 21 నగరాల్లో నీరు అడుగంటిపోతుంది

తాజా నివేదికలో నీతి ఆయోగ్‌ వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌15(జ‌నం సాక్షి ) : దేశంలో తీవ్ర నీటి సంక్షోభం తారా స్థాయికి చేరుతుంది.. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతీ చోటా నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తాజా నీతి ఆయోగ్‌ తన నివేదికలో తాగునీటి సంక్షోభం ఏ స్థాయిలో ఉంది స్పష్టంగా పేర్కొంది. సుమారు 60 కోట్ల మంది నీటి కొరత ఎదుర్కొంటున్నట్లు ఆ రిపోర్ట్‌ వెల్లడించింది. 24 రాష్టాల్ర నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నీతి ఆయోగ్‌ హెచ్చరించింది. 2020 కల్లా 21 నగరాల్లో నీరు అడుగంటి పోతుందని ఆ రిపోర్ట్‌లో తెలిపారు. వ్యవసాయానికి కూడా నీరే ప్రధానం కావడం వల్ల ఆ రంగం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. పైపు లైన్‌ ద్వారా నీరు అందించేందుకు నగరాల్లో అనుకూల పరిస్థితులు లేవు. దీంతో పట్టణాలు, నగరాల్లో నీటి కొరత ఏర్పడే సూచనలున్నాయి. గ్రామాల్లో స్వచ్ఛమైన నీరు అసలే అందడంలేదు. పరిశుభ్రమైన నీరు అందక ప్రతి ఏడాది రెండు లక్షల మంది చనిపోతున్నారు. భారత్‌లో సరఫరా అవుతున్న నీటిలో సుమారు 70 శాతం నీరు కలుషితమవుతున్నట్లు తెలుస్తోంది.