దేశం చూపు మిషన్‌ కాకతీయవైపు

1

– పనుల్లో జరభద్రం

– మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి):దేశమంతా మిషన్‌ కాకతీయ వైపు చూస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా, చిత్తశుద్ధితో పని చేయాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు చెప్పారు. మిషన్‌ కాకతీయపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పనుల పురోగతిపై సవిూక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సవిూక్షలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కొనసాగుతున్న మిషన్‌ కాకతీయ పనుల పురోగతిపై చర్చించారు. మిషన్‌ కాకతీయ రెండో దశ విజయవంతం కోసం రెగ్యులర్‌ గా ఫీల్డ్‌ విజిట్‌ చేస్తానని మంత్రి హరీష్‌ చెప్పారు. ఎక్కడ లోపాలు కనిపించినా కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు క్రమం తప్పకుండా ఫీల్డ్‌ కు పోవాలని ఆదేశించారు. మిషన్‌ కాకతీయ రెండో దశకు చాలా సమయం ఉందని మంత్రి హరీష్‌ తెలిపారు. రెండో దశ విజయవంతంగా నిర్వహించేందుకు ఇక నుంచి వారానికి ఒక్కసారి వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని చెప్పారు. మిషన్‌ కాకతీయ మొదటి దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు. మొదటి దశకు చాలా తక్కువ సమయం ఉన్నా అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. మిషన్‌ కాకతీయ మొదటి దశ పనుల్లో అలసత్వం పదర్శిస్తున్న ఏజెన్సీల పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. అధికారులు మొహమాటానికి పోవద్దని, పని చేయని వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని, అవసరమైతే తొలగించాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇంకా ప్రారంభించని మొదటి దశ పనులు ఏమైనా ఉంటే తొందరగా మొదలుపెట్టాలని చెప్పారు. కోటి రూపాయల కంటే తక్కువగా ఉన్న మిషన్‌ కాకతీయ మొదటి దశ పనులను 2016 మార్చ్‌ 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.