దేశం దాటి వెళ్లిపోయిన ఏనుగు చనిపోయింది..!

16brk-ele1ఢాకా: వరదల బీభత్సం కారణంగా మంద నుంచి విడిపోయి దిక్కుతోచక దేశం దాటి వెళ్లిపోయిన అసోం ఏనుగు చనిపోయింది. ఈ ఏనుగును కాపాడడానికి భారత్‌ నుంచి ప్రత్యేక బృందం బంగ్లాదేశ్‌కు వెళ్లింది. కానీ ఏనుగును కాపాడలేకపోయింది. మంద నుంచి విడిపోయి ఒంటరిగా దాదాపు 1700 కిలోమీటర్లు నడిచిన ఏనుగు బాగా నీరసించి ప్రాణాలు విడిచింది. ఏమాత్రం సత్తువ లేకుండా నిలబడలేని స్థితిలో కనిపించిన ఏనుగును కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. పెద్ద మొత్తంలో సెలైన్లు పెట్టినప్పటికీ కోలుకోలేకపోయింది.

రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన ఈ ఏనుగును బంగ్లాదేశ్‌లో వారం క్రితం గుర్తించారు. ఏనుగును బంగ్లాదేశ్‌లోని సఫారీ పార్కుకు తరలించడం కోసం మత్తు ఇచ్చేందుకు ప్రయత్నించారు. సెలైన్లు పెట్టారు. కానీ ఏనుగు ఆరోగ్యం కుదుటపడలేదు. మత్తు ఎక్కువ ఇవ్వడం వల్ల ఏనుగు చనిపోయి ఉండొచ్చని కూడా స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి. ఏనుగును కాపాడడానికి చాలా మంది గ్రామస్థులు కూడా సహకరించారు. కానీ ఫలితం లేకపోయింది. 1700కి.మీ.లు నడవడం, సరైన ఆహారం లేకపోవడం, బాగా నీరసించడం వల్ల చనిపోయిందని అధికారులు చెప్పారు. ఏనుగు శరీరాన్ని పోస్ట్‌మార్టంకు పంపించారు. ఇటీవల అసోంలో భారీ వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా అధిక సంఖ్యలో ఖడ్గమృగాలు కూడా మృత్యువాతపడ్డాయి.