దేశం మనది.. విడిచి ఎందుకు వెళ్తావ్?!
– స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను అవమానపరిచినట్లే!
– అమీర్ ఖాన్‌పై అసద్ ఫైర్
ముంబై నవంబర్24(జనంసాక్షి): అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు.దేశం మనది విడిచి ఎక్కడికి వెళ్తావ్.
దేశాన్ని వీడాలని భావించినట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ స్వాతంత్య్ర సమరయోధులను కించపరచడమే అవుతుందని ఒవైసీ మండిపడ్డారు. ‘మేం ఇండియాను వీడాలనుకుంటున్నామని మాట వరుసకు చెప్పినా అది దేశ స్వాత్రంత్య సమరయోధులకు అపకారం చేయడమే అవుతుంది. విశ్వంలో భూగ్రహం ఉన్నంతకాలం మమ్మల్ని ఎవరూ ఇండియా విడిచివెళ్లిపోమ్మని బలవంతపెట్టలేరు. మేం కూడా విడిచివెళ్లబోము’ అని ఒవైసీ పేర్కొన్నారు.
‘ఆయన వెళ్లిపోతే దేశంలో జనాభా తగ్గుతుంది’
దేశంలోని అభద్రతా భావం ఉందన్న బాలీవుడ్ ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఆమిర్ ఖాన్ కావాలనుకుంటే దేశాన్ని తప్పక వీడి వెళ్లిపోవచ్చునని, ఆయన వెళ్లిపోతే దేశంలో కొంత జనాభా అయినా తగ్గుతుందని ఆదిత్యనాథ్ సూచించారు.
ఆమిర్ నివాసం వద్ద ఆందోళన.. భద్రత పెంపు
ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో ముంబైలోని ఆయన నివాసం ఎదుట భద్రతను పెంచారు. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హిందూసేన కార్యకర్తలు కొందరు ఆయన నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు రంగంలోకి భద్రతను పెంచారు.