దేశవ్యాప్తంగా స్తంభించిన బ్యాంకింగ్‌, రవాణా సేవలు

న్యూఢిల్లీ : డిమాండ్ల సాధన కోసం 11 కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె మొదటి రోజు కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో బ్యాంకింగ్‌, తపాల, రవాణ, విద్య, వైద్య సేవల పై సమ్మె  ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్‌, తపాల సేవలు స్తంభించిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. దేశరాజధాని న్యూఢిల్లీలో ఆటోలు, రిక్డాల కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గోనడంతో రవాణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. ఉత్తరప్రదేశ్‌లో ఏడు వేలకు పైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముంబయిలో బ్యాంక్‌ సేవలు నిలిచిపోగా బస్సులు, రైళ్లు యథావిధిగా తిరుగుతున్నాయి. ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే ‘నో వర్క్‌ , నో పే’ విధానాన్ని అమలు చేస్తామని కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరించాయి. అయితే ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోకుండా కేరళలో కార్మికులు సమ్మెలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్‌లో మాత్రం సమ్మె ప్రభావం పాక్షికంగానే ఉంది. హర్యానాలో రాష్ట్ర రోడ్డు సంస్థ కార్మికులు చేపట్టిన బంద్‌లో విషాదం చోటుచేసుకుంది. అంబాలాలోని బస్సు డిపో వద్ద బస్సును ఆపేందుకు ప్రయత్నించిన కార్మిక సంఘ నేత నరేంద్రసింగ్‌పై బస్సు దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.