దేశానికే ఆదర్శంగా చేనేత బీమా

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి
చొప్పదండి , ఆగస్టు 7( జనం సాక్షి):
చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత భీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నుండి చేనేత బీమా అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి హాజరైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర పాలనలో చేతినిండా పని లేక ఆకలితో అలమటించి చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా చూసామని అప్పుడు వారిని పట్టించుకున్న నాయకులే లేరని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి చేనేత కార్మికునికి రాష్ట్ర ప్రభుత్వం బీమా చేసి వారికి బీమా సౌకర్యాన్ని కల్పించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు. చేనేత భీమా కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్ పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.