దేశాన్నే దోచుకుంటుంటే వ్యక్తిగతమెలా అవుతుంది?
` అమెరికాలో అదాని గురించి మోదీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికాలో విలేకరుల సమావేశంలో అదానీ గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తప్పుపట్టారు. ’’నరేంద్రమోదీజీ.. అది వ్యక్తిగత అంశం కాదు. అది దేశప్రయోజనాలకు సంబంధించిన విషయం’’ అని ఉత్తర్‌ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ విమర్శించారు.ఇటీవల ప్రధాని మోదీ అగ్రరాజ్యంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌పై అమెరికాలో పెట్టిన కేసు గురించి ట్రంప్‌తో భేటీ సమయంలో చర్చకు వచ్చిందా..? అని విూడియా సమావేశంలో మోదీకి ప్రశ్న ఎదురైంది. ‘’భారత్ ఓ ప్రజాస్వామ్య దేశం. వసుధైక కుటుంబం అనేది మా సంస్కృతి. ప్రపంచం మొత్తం మా కుటుంబం అనుకొంటాం. ప్రతి భారతీయుడిని మావాడిగానే భావిస్తాం. ఇద్దరు దేశాధినేతలు ఎప్పుడూ వ్యక్తిగత స్థాయి అంశాలను చర్చించరు’’ అని ప్రధాని వెల్లడిరచారు. ఈ సమాధానాన్ని రాహుల్ గతంలోనూ విమర్శించారు. ‘’ఈ విషయం గురించి దేశంలో ఎవరైనా ప్రశ్నిస్తే మౌనం దాల్చే ప్రధానమంత్రి.. అదే ప్రశ్నను విదేశాల్లో ఎవరైనా అడిగితే అది వ్యక్తిగత విషయమని బదులిస్తారు’’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేలా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ‘ఉన్నత స్థాయి’ వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు ఎఫ్‌సీపీఏ కింద పలువురిపై అమెరికాలో కేసులు నమోదు చేశారు. ఆ నిధులను అమెరికాలో పెట్టుబడి కింద అదానీ గ్రూప్ సవిూకరించడమే అక్కడ కేసు నమోదుకు కారణం. సౌర విద్యుత్ విక్రయ కాంట్రాక్టుల్లో అనుకూల షరతులు అమలుచేసేందుకు అదానీ గ్రూప్ 250 మిలియన్ డాలర్ల (రూ.2029 కోట్లు) మేర లంచాలు ఇచ్చారన్నది ఆరోపణ.ఇటీవల వ్యాపారాల్లో కొనసాగడానికి, ప్రాజెక్టులు దక్కించుకోవడానికి విదేశీ ప్రభుత్వాలు, అధికారులకు లంచం ఇచ్చే అమెరికా కంపెనీలు, విదేశీ సంస్థలపై చర్యలు తీసుకొనే 1977 ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్(ఎఫ్‌సీపీఏ) అమలును నిలిపేస్తూ ట్రంప్ సంతకాలు చేసి, యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండికి ఆదేశాలు జారీ చేయడంతో అదానీ గ్రూప్‌నకు ఊరట లభించింది.