దేశ ప్రతిష్ట పెంచండి
– రియో ఒలింపిక్స్‌లో మన జెండా రెపరెపలాడాలి
– ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ ,జులై 31(జనంసాక్షి): దేశ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్రీడాకారులకు పిలుపు ఇచ్చారు. ఆదివారం ఢిల్లీలో రన్ ఫర్ రియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియో ఒలింపిక్స్‌కు 200 మందిని పంపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 20 వేల మంది విద్యార్థులు సహా పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతీ క్రీడాకారుడు భారతకు గర్వకారణమవుతారని ఆయన ఆకాంక్షించారు. నాలుగేళ్ల తర్వాత టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు మరింత మంది క్రీడాకారులను పంపుతామని మోదీ అన్నారు.125 కోట్ల మంది దేశ ప్రజల తరఫున క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మోదీ చెప్పారు. క్రీడాకారులంతా పతకాలతో తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచంలోని చాలా మంది క్రీడాకారులు రియోకి వస్తారని, భారత క్రీడాకారుల విజయం కోసం 125 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆగస్టు 15న దేశంలో జెండా ఎగురవేస్తారని, రియో ఒలింపిక్స్‌లో భారత జెండా రోజూ రెపరెపలాడాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.