దేశ రైతాంగం సాధించిన భారీ విజయమిది !
రైతుల ఆందోళనలతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాల అమలుపై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలా అనేకంటే ఏడాదిగా రైతులు చేస్తున్న ఆందోళన విజయవంతం అయ్యింది. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకోవడం దేశంలో రైతాంగం విజయంగా చూడాలి. నిరంకుశ విధానాలను ఎలా ఎండగట్టవచ్చో..ఎలా దారికి తేవచ్చో అన్న కొత్త ఉద్యమ సంకేతాన్ని రైతులు ఈ దేశానికి అందించారు. వారి పోరుబాట రేపటి ఉద్యమానికి లేదా ప్రజా వ్యతిరేక ఉద్యమాలకు నాంది కాగలదనడంలో సందేహం లేదు. చట్టాలు ఎంతమేరకు వారికి ఉపయోగపడతాయో అన్న ధ్యాస లేదా చర్చ లేకుండా మోడీ ఏకపక్షంగా, నిరంకుశంగా తీసుకుని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు అన్నది ముమ్మాటికీ రైతుల సంఘటిత శక్తికి నిదర్శనంగా చూడాలి. అయితే ఇదే సందర్భంలో గత ఏడాదిగా పదుల సంఖ్యలో రైతులు ఈ ఉద్యమంలో అసువులు బాసారు. లఖీంపూర్ ఘటనలో ఐదారు గురు హత్య కావింపబడ్డారు. ఎన్నో రకాల నష్టాలు జరిగాయి. వీటన్నికటీ మోడీనే బాధ్యుడు. బిజెపి ముసుగులో తన నిరంకుశ విధానాలతో దేశాన్ని అధోగతి పాల్జేసిన పాలకుడిగా మోడీ ప్రజల ముందు ఇప్పుడు దోషిగా నిలబడ్డారు. ఇదే క్రమంలో పెట్రో ధరలు, ప్రబుత్వ రంగ సంస్థల అమ్మకాలపైనా ప్రజలు ఉద్యమించాల్సి ఉంది. ఎందుకంటే సాగుచట్టాల్లో కేవలం రైతులు మాత్రమే విజయం సాధించారు. రాజకీయ పార్టీలు అండగా నిలిచినా, పార్లమెంటులో పోరాడినా ఫలితం దక్కలేదు. కానీ ఏడాదికి పైగా వారు చేస్తున్న ఆందోళన లేదా ఉద్యమం కారణంగా మోడీ దిగివచ్చి సాగుచట్టాలను వెరనక్కి తీసుకోక తప్పలేదు. అందుకే ప్రజాగ్రహానికి తలొగ్గి వాటిని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ నెలాఖరులో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఇప్పటి వరకు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా వెనక్కి తీసుకోవాలి. విశాఖ స్టీల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టకుండా దేశ ఆస్తిగా గుర్తించి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. అప్పుడే మోడీ తన చిత్తశుద్దిని చాటుకోగలరు. 2020లో మూడు రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం. తీసుకొచ్చింది. ఇవి వివాదాస్పదంగా ఉండటంతో రైతులు రోడ్డెక్కారు. వెంటనే రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢల్లీి సరిహద్దుల్లో ఏడాది కాలంగా రైతులు గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘంగా పోరాటం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అదే సమయంలో ఈ చట్టాలు రైతులను కార్పోరేట్లకు బానిసలను చేస్తాయంటూ ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు రాస్తారోకోలు చేశాయి. కేందప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దిగివచ్చిన కేంద్రం.. రైతు చట్టాలను రద్దు చేసింది. ఈ మేరకు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే ఈ చట్టాల కారణంగా ప్రాణాలు కలోప్పోయిన వారికి ప్రధాని ఏం సమాధానం చెబుతారన్నది కూడా ముఖ్యమే. జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారన్నది కూడా ముఖ్యమే. నోట్ల రద్దు మొదలు జిఎస్టీ, సాగుచట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలు, కార్పోరేట్లకు ఊడిగం, కరోనా కష్టాల్లో ఆర్థిక మందగమనం వంటి అనేకానేక చర్యల కారణంగా దేశం భారీ మూల్యం చెల్లించుకుంది. బిజెపిలో తన మాటకు ఎదురులేకుండా చేసుకున్న మోడీ నిర్ణయాల కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడి పోతున్నారు. అయినా ఇవేవీ ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. చాయ్‌వాలాను అంటూ ప్రజలను నమ్మించి గొంతు కోసిన నేతగా ప్రజల ముందు నిలిచారు. ఇలాంటి పాలకులు దేశంలోనే కాదు ప్రపంచంలోనే మనగుడ సాగించలేదు. బిజెపికి ఉన్న మంచి అనే ముసుగును వేసుకున్న నియంతగా మోడీ అవతరించారు. కార్పోరేట్లకు ఊడిగం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం దేశంలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధిని ఏమాత్రం ప్రదర్శించలేదు. సరికదా ఆందోళన చేస్తున్న అన్నదాతల గురించి పట్టించుకోలేదు. కనీసం వారి మాటలకు విలువ ఇవ్వలేదు. కార్పేరేట్ రంగాన్ని సంతృప్తి పరిచి వారికి నూతనావకాశాలు కల్పించాలన్న లక్ష్యం తప్ప ఎక్కడా రైతులు వారి ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. వ్యవసాయాన్ని పండగచేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్న మాటలు సాగుచట్టాలతో బూటకమని తేలిపోయింది. ప్రజల ఉద్యమంలో కొట్టుకుపోతామన్న భయంతోనే వాటిని ఇప్పుడు రద్దు చేశారని భావించాలి. తన వైఫల్యాల నుంచి చేతులు దులుపుకునే ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు తప్ప మరోటి కాదు. సాగుచట్టాలు రైతుల భవిష్యత్‌ను అంధకారంలో పడవేస్తాయని, కార్పొరేట్ల దయా దాక్షిణ్యాలపై వారు ఆధారపడే పరిస్థితి కల్పిస్తాయని వ్యవసాయరంగ నిపుణులు హెచ్చరించినా పట్టించు కోలేదు. రైతుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకువచ్చి నిజంగా వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని భావించి ఉంటే వాటిపై విస్తృతంగా చర్చించేవారు. వారి జీవితాలను మరింత అతలాకుతలం చేస్తాయన్న విషయంలో రేగుతున్న చర్చ జరిగితే కనీసంగా స్పందించలేదు. ఈ చట్టాలు ఎలా మంచి చేస్తాయో చెప్పలేదు. ఈ బిల్లులను ఆమోదించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రహసనంగా మార్చిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ముందుతరం నేతలు బిజెపిలో ఆధిపత్యం చెలాయించి ఉంటే బహుశా ఈ బిల్లులను పార్లమెంటు లో ప్రవేశపెట్టేందుకు సాహసిం చేవారు కాదేమో. బిల్లు ఆమోదించే క్రమంలో ఎన్డీఏలో భాగస్వామి అయిన అకాలీదళ్‌కు చెందిన మంత్రి రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. దాదాపు 18 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకి స్తున్నాయని తెలిసినప్పటికీ పట్టించుకోలేదు. ఈ చట్టాలపై రాష్టాల్ర ముఖ్యమంత్రులతో మాట్లాడడం కానీ, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కానీ చేయలేదు. ఒక బిల్లును ఏదో రకంగా, కనీస చర్చ లేకుండా, సభ్యుల మనోభావాలతో నిమిత్తం లేకుండా తాను అనుకున్న రోజే ఆమోదింప చేయాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్న తీరు అంతా ఓ పద్దతి ప్రకారం జరిగింది. అంటే ఇది తమ అనుయా యులకు ఉద్దేశించిందే తప్ప రైతులపై ప్రేమతో కాదని ఆనాడే తేలిపోయింది. ఈ బిల్లులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం దేశంలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధిని ప్రదర్శించ లేదని తేలిపో యింది. కార్పేరేట్ రంగాన్ని సంతృప్తి పరిచి వారికి నూతనావకాశాలు కల్పించాలన్న ప్రేమను మాత్రమే ప్రకటించింది. తన వైఫల్యాల నుంచి చేతులు దులుపుకునే ప్రయత్నంలో భాగంగా మోడీ ఇప్పుడు రద్దుకు చర్యలు చేపట్టారనే చెప్పాలి. రైతులు సాధించిన అతిపెద్ద విజయంగా ఇది భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. వారి పోరాటస్ఫూర్తి మున్ముందు ఉద్యమాలకు ప్రేరణ కానుంది. ఈ క్రమంలో పాలకుల నిరంకుశ విధానాలకు ప్రజలు చైతన్యం కావాలి. పోరాటస్ఫూర్తిని పొందాలి.