దేశ వికాసం కోసమే కేసిఆర్ బిఆర్ఎస్ ఏర్పాటు
భాజపా పాలనలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ
నియంత్రణలోకి రాని ధరలు.. రోజురోజుకు రూపాయి పతనం
మోడీ పాలనలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలు
జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని
భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్ 9(జనంసాక్షి): భారతదేశ వికాసం కోసమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు జాతీయ పార్టీని ఏర్పాటు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని స్పష్టం చేశారు. ఆదివారం ఆమె కెసిఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై జనంసాక్షి తో మాట్లాడారు. తెలంగాణ రోల్ మోడల్ దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆమె వివరించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకవర్గాలు ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంలో పూర్తిగా విఫలమైనందునే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఆమె వివరించారు. అభివృద్ధిలో ప్రపంచ దేశాలు పరుగులు పెడుతుంటే భారతదేశంలో ఇప్పటివరకు మంచినీరు అందనీ గ్రామాలు, కరెంటు లేని పల్లెలు కోకొల్లలుగా ఉండడం ఆవేదన కలిగిస్తుందని ఆమె అన్నారు. ఎనిమిది ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అధిక ధరలు పెరగడం తప్ప సాధించిందేమీలేదని ఆమె విమర్శించారు. రోజురోజుకు జిడిపి వృద్ధిరేటు తగ్గిపోతుండగా, ద్రవ్యోల్బణం దేశ పరిస్థితిని వెక్కిరిస్తుండగా, రూపాయి పతనం మన కళ్ళముందే కలవర పెడుతున్న మాట వాస్తవం కాదని ఆమె సూటిగా ప్రశ్నించారు. దేశంలో 70 వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్ర గర్భంలో కలిసిపోతున్న పంట పొలాలకు, త్రాగునీటికి మళ్ళించలేని ప్రభుత్వాలు కేంద్రంలో కొనసాగడం అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని అందుకు కేంద్ర ప్రభుత్వం అందించిన అవార్డులే నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు.